ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్వర్ణ తార పురస్కారాలు
- పూర్వ విద్యార్థులకు ఉన్నత విద్యా ఉపకార వేతనాలు
దండెపల్లి, ఆంధ్రప్రభ: దండెపల్లి మండలంలోని రెబ్బనపల్లి ఉన్నత పాఠశాలలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పాఠశాలలో గతంలో చదువుకున్న పూర్వ విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించేందుకు ఉపకార వేతనాల నగదును పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో మొదటి విడత పరీక్షల్లో తరగతుల వారీగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేశారు.
ప్రతి తరగతి నుంచి పది మంది విద్యార్థులకు స్వర్ణ తార పురస్కారాలను అందజేశారు. విద్యార్థులను చదువులో ప్రోత్సహించేందుకు, పూర్వ విద్యార్థులకు ఉన్నత విద్యకు చేయూత అందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. రాజు, బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ స్వచ్ఛంద సంస్థ పాఠశాల డైరెక్టర్ ఎం.డి. షర్ఫుద్దీన్, ఉపాధ్యాయ బృందం, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.
