AP Tourism Campaign | దేశీయ పర్యాటకానికి ఏపీ కొత్త బ్రాండ్

AP Tourism Campaign | దేశీయ పర్యాటకానికి ఏపీ కొత్త బ్రాండ్

AP Tourism Campaign | ఏడాదిపాటు “హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్” ప్రచారం
గండికోట నుంచి అరకు వరకు ప్రత్యేక అభివృద్ధి
డెస్టినేషన్ వెడ్డింగ్స్‌పై ప్రభుత్వ ఫోకస్
పర్యాటక రంగంలో భారీ పెట్టుబడులకు ప్రోత్సాహం

AP Tourism Campaign | అమరావతి, ఆంధ్రప్రభ : పర్యాటకంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కోరారు. సొంత లాభం కొంత మానుకుని పొరుగు వాడికి తోడుపడవోయ్ అన్న చందాన రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి స్టేక్ హోల్డర్స్ అందరూ సహకరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

అనంతరం మాట్లాడుతూ, రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించడానికి పర్యాటక శాఖ పలు కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్స్‌ను మన రాష్ట్రంలోనే నిర్వహించుకోవాలని సూచించారు. దీంతో విదేశీ మారక నిల్వలను కాపాడుకోవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యుత్తమ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం “హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్” పేరుతో ఏడాది పాటు కొనసాగనున్న సమగ్ర పర్యాటక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ కార్యక్రమాన్ని ప్రకటిస్తూ, ఇది కేవలం ప్రచార కార్యక్రమం కాదని, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ఉపాధి విస్తరణ, సాంస్కృతిక వైభవ ప్రాచుర్యానికి దోహదపడే ప్రజా ఉద్యమమని తెలిపారు.

సచివాలయంలోని రెండో బ్లాక్ సమావేశ మందిరంలో బుధవారం టూరిజం అభివృద్ధిపై వర్చువల్ సమావేశం నిర్వహించారు. తొలుత “హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్” పోస్టర్‌ను మంత్రి దుర్గేష్, పర్యాటక శాఖ అధికారులు ఆవిష్కరించారు. అనంతరం మంత్రి దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ.. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్న ప్రధానమంత్రి Narendra Modi పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. విదేశీ పర్యటనలపై భారీగా ఖర్చు చేస్తున్న భారతీయులను దేశీయ పర్యాటక వైపు మళ్లించడం ద్వారా దేశ సంపద దేశంలోనే నిల్వ ఉండేలా చేయడమే లక్ష్యమన్నారు.

గండికోట, అరకు, విశాఖ సముద్రతీరాలు, అమరావతి, తిరుపతి, మన్యం ప్రాంతాలు, గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాలు వంటి విశిష్ట పర్యాటక ప్రదేశాలను సమగ్రంగా అభివృద్ధి చేసి ప్రపంచానికి పరిచయం చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యంగా తిరుమలతో పాటు శ్రీశైలం, పంచారామాలు, నవ వైష్ణవ క్షేత్రాలను అనుసంధానిస్తూ ఆధ్యాత్మిక పర్యాటక వలయాలు అభివృద్ధి చేస్తామని చెప్పారు.

డెస్టినేషన్ వెడ్డింగ్స్ రంగంలోనూ రాష్ట్రానికి అపార అవకాశాలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. తిరుపతి, అరకు, విశాఖ వంటి ప్రాంతాల్లో వివాహ వేడుకల నిర్వహణకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే సమావేశాలు, పెట్టుబడి సదస్సులు, వ్యాపార కార్యక్రమాలకు అనువుగా అంతర్జాతీయ ప్రమాణాల కన్వెన్షన్ కేంద్రాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలుగువారు రాష్ట్ర పర్యాటకాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. ప్రతి ప్రవాస తెలుగు కుటుంబం కనీసం ఐదు విదేశీ కుటుంబాలను ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ఆహ్వానించినా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు విశేష బలం చేకూరుతుందని తెలిపారు. పర్యాటక రంగ అభివృద్ధికి అనుగుణంగా ప్రభుత్వం హోటల్ రంగానికీ ప్రాధాన్యం ఇస్తోంది. గత ఏడాదిలోనే 42 హోటల్ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసి దాదాపు 9,500 కొత్త గదుల సామర్థ్యాన్ని సృష్టించే ప్రక్రియ ప్రారంభించినట్లు వెల్లడించారు. విశాఖ, చీరాల ప్రాంతాల్లో సాహస క్రీడలు, సముద్రతీర పర్యాటక కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు.

విమాన, రైలు, రహదారి, జలమార్గ అనుసంధాన పరంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక బలం ఉందని మంత్రి తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, కడప విమానాశ్రయాలతో పాటు గుంటూరు సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి దశలో ఉందన్నారు.

హోటల్ సంఘాలు, ట్రావెల్ సంస్థలు, వెడ్డింగ్ ప్లానర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, పర్యాటక రంగ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో దాదాపు 200 మంది పాల్గొన్నారు. హోటళ్లు ప్రత్యేక రాయితీలు ఇవ్వడానికి, ట్రావెల్ సంస్థలు ప్రత్యేక ప్యాకేజీలు రూపొందించడానికి ముందుకు వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా విదేశీ మారకద్రవ్య పొదుపుతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. “హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్” కార్యక్రమం ద్వారా రాష్ట్రాన్ని దేశీయ పర్యాటక రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ఇన్‌ఛార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి పద్మావతి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply