ఆంధ్రప్రభ ఎఫెక్ట్.. ప్రమాదకర వేపచెట్టుకు మోక్షం
కథనంతో కదిలిన అధికారులు.. తొలగింపుతో తప్పిన ముప్పు
బాల్కొండ, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో ప్రధాన రహదారి పక్కన ప్రమాదకరంగా మారిన భారీ వేపచెట్టును అధికారులు ఆదివారం తొలగించారు. దశాబ్ద కాలంగా ఉన్న ఈ చెట్టు పూర్తిగా ఎండిపోవడంతో ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో అటుగా రాకపోకలు సాగించే వాహనదారులు, పాదచారుల్లో ఆందోళన నెలకొంది. ఈ సమస్యపై గత నెల 19న ‘ఆంధ్రప్రభ’ జిల్లా టాబ్లాయిడ్‌లో ‘చెట్టు ఎండిపోయి..! ప్రమాదకరంగా మారి..!!’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. వర్షాకాలంలో బలమైన ఈదురుగాలులు వీచే సమయంలో చెట్టు కూలి ప్రమాదం జరిగే అవకాశం ఉందని, ముందస్తుగా తొలగించాలని కథనం ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లింది.
కథనంపై స్పందించిన అటవీ శాఖ అధికారులు గ్రామపంచాయతీ పాలకవర్గం సహకారంతో ఎండిపోయిన వేపచెట్టును తొలగించారు. దీంతో ప్రధాన రహదారిపై రాకపోకలు సాగించే వాహనదారులు, పాదచారులకు పొంచి ఉన్న ప్రమాదం తప్పింది. ముందస్తు చర్యలు చేపట్టడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యను వెలుగులోకి తీసుకువచ్చి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసిన ‘ఆంధ్రప్రభ’ యాజమాన్యం, జిల్లా టాబ్లాయిడ్ విభాగం, బాల్కొండ స్థానిక విలేకరికి స్థానికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యలను నిరంతరం వెలుగులోకి తీసుకువస్తున్న ‘ఆంధ్రప్రభ’కు అభినందనలు తెలిపారు. అటవీ శాఖ అధికారులు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, స్థానిక నాయకులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.
