భీమేశ్వరాలయంలో భక్తుల రద్దీ
సెలవు రోజుతో పోటెత్తిన భక్తులు.. 35 వేల మందికి దర్శనం
ఆలయానికి రూ.25 లక్షల ఆదాయం
వేములవాడ, ఆంధ్రప్రభ: వరుస సెలవు దినాలు కావడంతో వేములవాడ రాజన్న ఆలయ అనుబంధ దేవాలయమైన భీమేశ్వరాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలిరావడంతో భీమేశ్వర స్వామివారి దర్శనం కోసం ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు. ఆలయ వర్గాల సమాచారం ప్రకారం ఒక్కరోజే సుమారు 35 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. దర్శనం, ప్రసాదాల విక్రయాలు, ఇతర సేవల ద్వారా ఆలయానికి సుమారు రూ.25 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.
సోమవారం భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శన క్యూలైన్లు, తాగునీరు, భద్రత, ఇతర మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. రద్దీకి అనుగుణంగా అదనపు ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులు ఆలయ సిబ్బందికి సహకరించాలని కోరారు.
