మైసమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించిన విప్
పెద్దపల్లి, ఆంధ్రప్రభ: ఆషాఢమాస బోనాల సందర్భంగా హైదరాబాద్ అలీజా కోట్లలోని శ్రీ కోట మైసమ్మ ఆలయంలో అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆదివారం పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక నాయకులతో కలిసి ఆలయానికి చేరుకున్న ఆయన అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.
ఈ సందర్భంగా విజయరమణారావు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించి మరింతగా పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. బోనాల పండుగను ఘనంగా నిర్వహించే ఆలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రైతులకు పాడి పంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని మైసమ్మ అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
