Streenidhi-Dwakra : రూ.3 లక్షల యూనిట్..Andhra Prabha Top News

Streenidhi-Dwakra : రూ.3 లక్షల యూనిట్..Andhra Prabha Top News

  • డ్వాక్రా మహిళలకు కొత్త ఉపాధి మార్గం
  • స్త్రీనిధి స‌రికొత్త పథకం
  • ఆహార శుద్ధి రంగంలో అవకాశాలు
  • రు. 3 ల‌క్ష‌ల వ్య‌యంతో యూనిట్
  • స్త్రీనిధి రుణంతో PMFME సబ్సిడీ
  • కూలినాలీ స్థాయి నుంచి ఉపాధి క‌ల్ప‌న‌ స్థాయికి
  • మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ వెల్ల‌డి

(ఆంధ్ర‌ప్ర‌భ , అమ‌రావ‌తి)

Streenidhi-Dwakra : డ్వాక్రా మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్ది… వారు ఉద్యోగం కోరుకునే స్థాయి నుంచి ఉపాధి క‌ల్పించే పారిశ్రామిక వేత్తలుగా మార్చ‌డ‌మే రాష్ట్ర ప్ర‌భుత్వ ల‌క్ష్యం అని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ శుక్ర‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ (PMFME) పథకాన్ని స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌తో అనుసంధానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంద‌న్నారు. ఈ ప‌థ‌కంలో అర్హత కలిగిన డ్వాక్రా మహిళలు రు. 3 లక్షల వరకు యూనిట్ వ్యయంతో ఆహార శుద్ధి యూనిట్లను స్త్రీనిధి రుణం ద్వారా ఏర్పాటు చేసుకోవ‌చ్చ‌ని… దీనికి PMFME పథకం కింద లభించే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ అందుతుంద‌ని మంత్రి తెలిపారు. ఈ ప‌థ‌కంలో మ‌హిళ‌లు పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్, చిరుధాన్యాలు, పప్పులు, మసాలాలు, పచ్చళ్లు, పిండి పదార్థాలు, స్నాక్స్ వంటి స్థానిక ఆహార ఉత్పత్తుల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసుకోవ‌చ్చ‌ని.. ప్రతి జిల్లాలోని జిల్లా సమాఖ్యలను District Resource Organisations (DROs)గా పరిగణించి, వారి ద్వారా ఆసక్తి, సామర్థ్యం ఉన్న డ్వాక్రా మహిళలను గుర్తించడం జరుగుతుంద‌న్నారు. ఈ ప‌థ‌కంలో ఎంపికైన మ‌హిళ‌ల‌కు ముడిసరుకు సేకరణ, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ సౌక‌ర్యాల‌ను ప్ర‌భుత్వం త‌ర‌పున క‌ల్పిస్తామ‌ని మంత్రి తెలిపారు. మహిళలకు కేవలం రుణం ఇవ్వడమే కాకుండా, వారి వ్యాపారం విజయవంతం అయ్యే వ‌ర‌కు ప్ర‌భుత్వ తోడ్పాటు ఉంటుంద‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ మ‌హిళ‌లు కూడా పారిశ్రామిక వేత్త‌లుగా త‌యారు కావ‌డంతో పాటు ప్ర‌తి కుటుంబంలోనూ ఒక పారిశ్రామిక వేత్త‌ను త‌యారు చేయ‌డ‌మే గౌర‌వ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు గారి ల‌క్ష్యం అని మంత్రి తెలిపారు. అర్హత కలిగిన డ్వాక్రా మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వ‌యం అభివృద్దితో పాటు ప‌లువురికి ఉపాధి క‌ల్పించే పారిశ్రామిక వేత్త‌లుగా ఎద‌గాల‌ని ఆకాంక్షించారు.