ఘనంగా మల్లయ్య యాదవ్ జన్మదిన వేడుకలు..
కోదాడ, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, కోదాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లం మల్లయ్య యాదవ్ జన్మదిన వేడుకలను కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రాలతో పాటు గ్రామగ్రామాన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, అభిమానులు, నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. తనపై చూపిస్తున్న ఆప్యాయత, అభిమానం, ఆదరణకు ఈ ప్రాంతానికి, ఈ గడ్డకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. ప్రజలకు సేవ చేయడం తన భాగ్యంగా భావిస్తున్నానని, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి, కోదాడ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయడంతో పాటు తెలంగాణ పూర్వ వైభవం కోసం కృషి చేస్తానని మల్లయ్య యాదవ్ అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ను మళ్లీ నంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు ప్రతి కార్యకర్తతో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు. జన్మదిన వేడుకల్లో నియోజకవర్గ నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
