Friendship-Movement : ఇక స్నేహ బంధం Andhra Prabha Spl Story
Friendship-Movement : ఇక స్నేహ బంధం Andhra Prabha Spl Story
- వైరానికి శుభం కార్డు
- చిగురించిన అనుబంధం .
- చిన్ని,,కొలికపూడి హ్యాపీ బర్త్ డే మూమెంట్
- తిరువూరు అభివృద్ధే ఇద్దరి లక్ష్యం
(ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ )
ఒకప్పుడు తిరువూరు రాజకీయాల్లో ‘చిన్ని–కొలికపూడి’ పేర్లు వినిపిస్తేనే వర్గపోరు గుర్తుకొచ్చేది. పరస్పర ఆరోపణలు, ఆధిపత్య పోరు, సామాజిక మాధ్యమాల్లో ఘాటైన వ్యాఖ్యలు, చివరకు పార్టీ క్రమశిక్షణ కమిటీ వరకు వెళ్లిన వ్యవహారం.. ఇలా కొంతకాలం ఇద్దరు నేతల మధ్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. అయితే కాలం గడిచేకొద్దీ రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. తాజాగా ఒకరి జన్మదినానికి మరొకరు సామాజిక మాధ్యమం వేదికగా శుభాకాంక్షలు చెప్పుకోవడం తిరువూరు టీడీపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది.
Friendship-Movement తొలినాళ్లలోనే విభేదాల బీజాలు..
2024 ఎన్నికల సమయంలో తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ అంతర్గత సమీకరణాలు చర్చనీయాంశంగా మారాయి. ఎమ్మెల్యేగా కొలికపూడి శ్రీనివాసరావు ఎన్నికైన తర్వాత ఆయన పనితీరుపై పార్టీలోని కొందరు నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్ని తదితరులు కొలికపూడితో సమావేశమై సర్ది చెప్పే ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాలతో విభేదాలు పూర్తిగా సమసిపోలేదు. 2025లో వివాదం మరింత బహిరంగ రూపం దాల్చింది. ఎమ్మెల్యే కొలికపూడి చేసిన ఆరోపణలు, వాటికి సంబంధించిన సామాజిక మాధ్యమ పోస్టులు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. ఎన్నికల టికెట్ వ్యవహారంలో డబ్బుల ఆరోపణలు చేయడం, వాటిని ఖండించేలా ప్రత్యారోపణలు రావడం ద్వారా ఇద్దరి మధ్య వివాదం పార్టీ వేదిక దాటి బహిరంగ రాజకీయ చర్చగా మారింది. ఈ వ్యవహారంపై టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఇద్దరు నేతలనూ పిలిచింది.
Friendship-Movement పతాక స్థాయిలో ఆధిపత్య పోరు…
తిరువూరు నియోజకవర్గంలో రాజకీయ ఆధిపత్యం ఎవరిది అన్న అంశం కూడా ఈ వివాదానికి మరో కోణంగా మారింది. ఎంపీగా కేశినేని చిన్ని నియోజకవర్గంపై తన రాజకీయ ప్రభావాన్ని కొనసాగించాలని చూస్తుండగా, ఎమ్మెల్యేగా కొలికపూడి స్థానికంగా తన పట్టును బలోపేతం చేసుకోవాలనే రాజకీయ అవసరం ఏర్పడింది. ఈ రెండు రాజకీయ కేంద్రాల మధ్య సమన్వయం లోపించిన ప్రతిసారీ విభేదాలు బహిర్గతమయ్యాయి. 2025 చివర్లో కూడా వర్గపోరు వివిధ రూపాల్లో కొనసాగుతూ వచ్చాయి. ఎమ్మెల్యే కొలికపూడి సామాజిక మాధ్యమ పోస్టులు, ఆయనకు వ్యతిరేకంగా ఉన్న నేతలతో ఏర్పడిన వివాదాలు, ఆ నేతలు చిన్ని వర్గానికి చెందినవారనే ప్రచారం తిరువూరు టీడీపీ అంతర్గత రాజకీయాలను మరింత వేడెక్కించాయి.
Friendship-Movement దేవుడి సాక్షిగా మరోసారి రచ్చ..
వివాదాలు సద్దుమణిగాయని భావించిన సమయంలోనే 2026 మార్చిలో నెమలి వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా మరోసారి ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. పట్టువస్త్రాల సమర్పణ అంశంలో ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య వివాదం తారా స్థాయికి చేరుకుంది. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ ఘటనతో ఇద్దరి మధ్య విభేదాలు ఇంకా పూర్తిగా సమసిపోలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది.
Friendship-Movement నేడు మారిన స్వరం…
అయితే మార్చి ఘటన తర్వాత రాజకీయ స్వరంలో మార్పు కనిపించింది. కొలికపూడి శ్రీనివాసరావు గత విభేదాలు పరిష్కారమయ్యాయని, ఇకపై పార్టీ నిర్మాణం, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నరు. ‘గతం గతమే’ అన్న ధోరణితో ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఆయన పలు సందర్భాల్లో వ్యక్తం చేస్తూ వచ్చారు. అయితే ఆ తర్వాత కూడా రాజకీయంగా భిన్నాభిప్రాయాలు పూర్తిగా కనుమరుగయ్యాయని చెప్పే పరిస్థితి లేదు. ఏప్రిల్‌లో తిరువూరు స్థానిక రాజకీయ పరిణామాల్లో మరోసారి ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరు చర్చకు వచ్చింది. దీంతో సయోధ్య ప్రక్రియ ఎంతవరకు స్థిరపడిందన్నది అప్పట్లో ప్రశ్నగానే మిగిలింది.
Friendship-Movement హ్యాపీ బర్త్ డే మూమెంట్ …
ఈ నేపథ్యమే ఇప్పుడు తాజాగా చోటుచేసుకున్న పరిణామానికి రాజకీయ ప్రాధాన్యతను తీసుకొచ్చింది. సోమవారం తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు జన్మదినం సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తన వాట్సాప్ స్టేటస్‌లో “జన్మదిన శుభాకాంక్షలు కొలికపూడి శ్రీనివాస్ గారు..” అంటూ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు గతవారం తన జన్మదినం సందర్భంగా ఎంపీ చిన్నికి ఎమ్మెల్యే కొలికపూడి సైతం వాట్సాప్ స్టేటస్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇద్దరు నేతలు ఒకరి జన్మదినానికి మరొకరు బహిరంగంగా శుభాకాంక్షలు చెప్పుకోవడం సాధారణ మర్యాదగానే కనిపించినా, గతంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో తిరువూరు రాజకీయాల్లో దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. గతంలో సామాజిక మాధ్యమమే ఇద్దరి మధ్య విభేదాలకు వేదికగా మారగా.. ఇప్పుడు అదే సామాజిక మాధ్యమం స్నేహపూర్వక సందేశాలకు వేదిక కావడం రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారింది.
. Friendship-Movement ఇక అభివృద్ధికి శ్రీకారం’?
ఎంపీ కేసినేని చిన్ని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య పూర్తి స్థాయి సయోధ్య కుదిరిందని అధికారికంగా ప్రకటించకపోయినా, పరస్పర శుభాకాంక్షలు మాత్రం సంబంధాల్లో మార్పునకు సానుకూల సంకేతంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తిరువూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంపీ, ఎమ్మెల్యే కలిసి పనిచేస్తామని చెబుతున్న నేపథ్యంలో ఈ పరిణామం టీడీపీ శ్రేణుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Friendship-Movement ఆధిపత్యం వీడి అభివృద్ధి వైపు…
తిరువూరు రాజకీయాల్లో ఇంతకాలం కనిపించిన వ్యక్తిగత విభేదాలు, వర్గపోరు, ఆధిపత్య రాజకీయాలకు బదులుగా అభివృద్ధి అజెండా ముందుకు వస్తే అది పార్టీకి, నియోజకవర్గానికి రాజకీయంగా ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంది. ఎంపీ స్థాయిలో లభించే కేంద్ర సహకారం, ఎమ్మెల్యే స్థాయిలో నియోజకవర్గ అవసరాలపై ఉన్న అవగాహన కలిస్తే అభివృద్ధి కార్యక్రమాలకు మరింత బలం చేకూరుతుందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే ఇది పూర్తి స్థాయి రాజకీయ సయోధ్యగా మారిందా? లేక ప్రస్తుతానికి మర్యాదపూర్వక స్నేహ సంకేతాలకే పరిమితమా? అన్నది రాబోయే రోజుల్లో వారి ఉమ్మడి కార్యక్రమాలు, బహిరంగ ప్రకటనలు, తిరువూరు రాజకీయాల్లో వారి వర్గాల మధ్య సమన్వయం ద్వారా తేలనుంది. ఇప్పటివరకు ‘ఎవరి ఆధిపత్యం?’ అన్న ప్రశ్నతో సాగిన తిరువూరు రాజకీయాల్లో.. ఇప్పుడు ‘ఎవరి అభివృద్ధి పనితీరు?’ అన్న ప్రశ్నకు మార్గం సుగమం అవుతుందా అన్నదే ఆసక్తికరంగా మారింది. గతంలో విభేదాలకు ప్రతీకగా నిలిచిన ఇద్దరు నేతలు.. ఇప్పుడు పరస్పర శుభాకాంక్షలతో స్నేహానికి సంకేతాలు ఇస్తుండటంతో తిరువూరు టీడీపీలో కొత్త రాజకీయ అధ్యాయానికి తెరలేచిందా అన్న చర్చ మొదలైంది.
