ఓటు హక్కు కోల్పోకుండా అప్రమత్తంగా ఉండాలి
- అచ్చంపేట పట్టణ తాజా మాజీ 15వ వార్డు కౌన్సిలర్ కానోజ్ మనోహర్ ప్రసాద్
అచ్చంపేట, ఆంధ్రప్రభ : ప్రతి ఓటరు తమ ఓటు హక్కును కాపాడుకునేలా అప్రమత్తంగా ఉండాలని అచ్చంపేట పట్టణ తాజా మాజీ 15వ వార్డు కౌన్సిలర్ కానోజ్ మనోహర్ ప్రసాద్ (మన్ను పటేల్) ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం అచ్చంపేట పట్టణంలోని 15వ వార్డు లోని అంగన్‌వాడీ కేంద్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా జరుగుతున్న ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలతో మాట్లాడిన మనోహర్ ప్రసాద్, అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటును నమోదు చేసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న 15వ వార్డు ప్రజలు తమ ఓటును స్వగ్రామంలోనే నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒకే ప్రాంతంలో మాత్రమే ఓటు ఉండాలని, రెండు చోట్ల ఓటు నమోదు చేసుకుంటే ఓటు హక్కు కోల్పోయే అవకాశం ఉంటుందని సూచించారు. “ఒకే మనిషి – ఒకే ఓటు” అనే ఎన్నికల సంఘం నిబంధనను ప్రతి ఒక్కరూ పాటించి, వార్డులోని ఏ ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
