GO 190 | కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కాంగ్రెస్ వెనుకంజ
GO 190 | కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కాంగ్రెస్ వెనుకంజ
GO 190 | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తోందని తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఉద్యమకారులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని ఆరోపించారు.
317 జీవో సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ, దానికి సవరణగా 190 జీవోను తీసుకొచ్చిందని గుర్తుచేశారు. అయితే 190 జీవో విడుదలై దాదాపు తొమ్మిది నెలలు గడిచినా ఇప్పటి వరకు అమలు చేయలేదని మండిపడ్డారు.
317 జీవో వల్ల ఉపాధ్యాయులతో పాటు పలు శాఖల ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బాధితులను వారి స్వస్థలాలకు పంపిస్తామని, అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, కానీ ఆ హామీలు అమలుకు నోచుకోలేదని విమర్శించారు.
190 జీవో అమలుకు రేషనలైజేషన్‌తో సంబంధం లేదని, ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే అదనపు పోస్టులు సృష్టించి జీవో అమలు చేయాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల హక్కుల కోసం తెలంగాణ రక్షణ సేన పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్న నాయకులు, వెంటనే 190 జీవోను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
