సంస్థాన్ నారాయణపురంలో తీవ్ర గ్యాస్ కొరత

సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : గల్ఫ్ దేశాల నుంచి దిగుమతులు తగ్గడంతో మార్చి, ఏప్రిల్ నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ కొరత ఏర్పడింది. దీనికి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుంచి దిగుమతులను పెంచినప్పటికీ, యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో భారత్ గ్యాస్ కొరత తీవ్రంగా కొనసాగుతోంది.

గత మూడు నెలలుగా గ్యాస్ సిలిండర్లు సమయానికి అందకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ అందుబాటులో లేకపోవడంతో పలువురు వినియోగదారులు తిరిగి కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు.

గ్యాస్ సరఫరా ఆలస్యంపై వినియోగదారులు ప్రశ్నించగా, పైస్థాయి నుంచి సరఫరా రావడం లేదని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సమాధానం చెబుతున్నట్లు సమాచారం. అయితే గ్యాస్ ఏజెన్సీలు సమయానికి సరఫరా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే కొరత తీవ్రతరమైందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

Leave a Reply