ముస్లింలకు తక్షణం గ్యాస్ డోర్ డెలివరీ చేయాలి…

ముస్లింలకు తక్షణం గ్యాస్ డోర్ డెలివరీ చేయాలి…

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : కొండపల్లి పరిసర ప్రాంతాల్లో గ్యాస్ కంపెనీలు ఉన్నా రంజాన్ పండుగ సందర్భంగా గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ లు ఇవ్వకపోవడం ధర్మార్థమైన చర్య అని అహలే సున్నత్ జమాత్ కన్వీనర్ మహ్మద్ అల్తాఫ్ బాబా అన్నారు. కొండపల్లి షా బుఖారి బాబా ఆస్థానలో గ్యాస్ వినియోగదారుల ఇబ్బందులపై శుక్రవారం ఆయన మాట్లాడారు. రంజాన్ మాసంలో నిత్యం ఏదో వంటకాలకు గ్యాస్ అవసరమైతే బుక్ చేసినా గంటల తరబడి క్యూలో నిలబడి డెలివరీ స్లిప్పు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు.

ఈ పరిణామాలతో గ్యాస్ వినియోగదారులు సైతం ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కొండపల్లి ప్రజలు ఇబ్బంది పడటం దురదృష్టకరమన్నారు. ముఖ్యంగా గ్యాస్ కంపెనీలకు హజరత్ గాలిబ్ షహీద్ దర్గా 44, 45 సర్వే నెంబర్లు 150 ఎకరాలు అప్పట్లో ఇవ్వడం జరిగిందని, మైనార్టీ భూములు తీసుకొని మైనార్టీల పండగలకు గ్యాస్ సిలిండర్లు కోసం క్యూలో వేచి ఉంచడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కొండపల్లి గ్యాస్ కంపెనీలో ఏదైనా ప్రమాదం జరిగితే పరిసర ప్రాంతాలన్నీ బూడిద అయ్యే అవకాశాలు ఉన్నాయని, పరిస్థితులు తీవ్రంగా ఉంటే ప్రజల ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందన్నారు.

ఇలాంటి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు గ్యాస్ ఉచితంగా ఇవ్వాల్సిన ఆవశ్యకత గ్యాస్ కంపెనీలపై ఉందని తెలిపారు. కొండపల్లిలో ఉన్న గ్యాస్ కంపెనీలు కొండపల్లి ముస్లింలకు, ప్రజలకు ఉచితంగా ఇవ్వాల్సింది పోయి, రంజాన్ నెల ఉపవాసంలో ఉన్న ముస్లింలు ఎండలో గ్యాస్ కోసం గంటల తరబడి క్యూలో నిలబడటంతో ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు.

ఇప్పటికే గ్యాస్ డెలివరీ ఇంటికి వచ్చే పరిస్థితికి గ్యాస్ కంపెనీలు స్వస్తి పలికాయని ప్రతి ఒక్కరూ కంపెనీ వద్దకు వెళ్లి తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్యాస్ ఏజెన్సీలలో ఎటువంటి అదనపు చెల్లింపులు లేకుండా, మరి ముఖ్యంగా పండుగలను పురస్కరించుకొని బుక్ చేసుకున్న అర్హులందరికీ వెంటనే గ్యాస్ డెలివరీ అయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.