ఎస్ఆర్‌లో ఫ్యాషన్ డిజైన్ విద్యకు శ్రీకారం

ముఖ్య అతిథిగా జాతీయ అవార్డు గ్రహీత నీతా లుల్లా

హసన్ పర్తి, ఆంధ్రప్రభ : సృజనాత్మక విద్యారంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ ఎస్‌ఆర్ యూనివర్సిటీ, హామ్‌స్టెక్ సంస్థలు సంయుక్తంగా ప్రపంచ స్థాయిలో ప్యాషన్ డిజైన్ విద్యకు శ్రీకారం చుట్టారు. శనివారం ఉదయం ఎస్‌ఆర్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, జాతీయ అవార్డు గ్రహీత నీతా లుల్లా ముఖ్య అతిథిగా హాజరై డిజైన్ స్కూలుకు సెలబ్రిటీ గా వ్యవహరించనున్నారు.

డిజైన్ విద్యలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన హామ్‌స్టెక్, విద్యా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఎస్‌ఆర్ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ డిజైన్ స్కూల్ ఏర్పాటు అవుతోంది. ఇందులో ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్ విభాగాల్లో బాచిలర్ ఆఫ్ డిజైన్ (బి.డిజైన్) కోర్సులు అందుబాటులో ఉంటాయి. డిజైన్ రంగంలో ఉన్న అవకాశాలు, పరిశ్రమ అవసరాలు, భవిష్యత్ కెరీర్ మార్గాలపై నీతా లుల్లా విద్యార్థులకు, ఔత్సాహికులకు మార్గనిర్దేశనం చేయనున్నారు. ఈ సందర్భంగా ఫ్యాషన్ ప్రదర్శన, సృజనాత్మక రంగంలోని తాజా ధోరణులపై అవగాహన కార్యక్రమాలు, క్యాంపస్ సందర్శన, నిపుణులతో పరస్పర చర్చలు నిర్వహించనున్నారు. డిజైన్ రంగంలో కెరీర్‌ను నిర్మించుకోవాలనుకునే విద్యార్థులు, తల్లిదండ్రులు, ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని నిర్వహకులు తెలిపారు. ఆసక్తి గల వారు 7095273747 నంబర్‌ను సంప్రదించి ప్రవేశ పాస్ పొందవచ్చని పేర్కొన్నారు.