ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ అధికారి, సిబ్బంది కొరత..

ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ అధికారి, సిబ్బంది కొరత..

పడిగాపులు కాస్తున్న రోగులు..

పాయకాపురం, ఆంధ్రప్రభ : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని పాయకాపురం,సింగ్ నగర్ శివారు ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరత ఉంది.పాయకాపురం, సింగ్ నగర్ ప్రాంతంలో సుమారు ఎనిమిది ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వాటిలో మెడికల్ అధికారులు నలుగురు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఒక మెడికల్ అధికారి రెండు ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు అందిస్తున్నట్లు సమాచారంగా ఉంది. ఇక సిబ్బంది కొరత చెప్పనక్కర్లేదు. ప్రతి రోజు రోగులు ఆరోగ్య కేంద్రాల వద్ద పడిగాపులు పడాల్సి వస్తున్నదని పలువురు వాపోతున్నారు. అసలే వేసవికాలం ఆపైన విపరీత ఎండలు ఆ సమయంలో ఆరోగ్య కేంద్రాల్లో రోగులు ఉదయం వచ్చి మధ్యాహ్నం వరకు పడిగాపులు కాస్తున్నారు. సాధారణ రోగాలకు ఉచిత మందులు ఇచ్చే ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరత కారణంగా, రోగులు పడిగాపులు పడాల్సి వస్తోంది. కొంతమంది ఎండ తీవ్రత కారణంగా సొమ్మసిల్లి పోతున్నారు.

సింగ్ నగర్లో మెడికల్ అధికారి లేరా..?.

అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో ఆరోగ్య కేంద్రంలో మెడికల్ అధికారి లేరా అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.పలువురు రోగులు ఆరోగ్య కేంద్రానికి వచ్చినప్పుడు అక్కడ ఆ సమయంలో మెడికల్ అధికారి ఉండటం లేదు. మెడికల్ అధికారి ఎక్కడకు వెళ్లారని, సిబ్బందిని అడిగితే వేరొక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారని బదులు చెప్తుతున్నారని పలువురు బాహాటంగా చెప్తున్నారు.

పడిగాపులు కాస్తున్నారు.

ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది కొరత ఉండటంతో రోగులు గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్నారు. తీవ్రమైన ఉక్కపోత కారణంగా వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వంపై విమర్శలు…

ప్రభుత్వం ఆరోగ్య కేంద్రాల్లో అన్నీ రకాల వసతులు కల్పిస్తున్న నేపథ్యంలో సిబ్బంది కొరత కారణంగా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.నిత్యం ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే స్పందిస్తూ, వారి అవసరతలు తీర్చడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఐతే సిబ్బంది కొరతను నివృత్తి చేయడానికి సంబంధిత ఆరోగ్య శాఖ వెంటనే అన్నీ ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్, సిబ్బంది కొరత తీర్చాలని పలువురు కోరుతున్నారు.

Leave a Reply