KNL |డ్రోన్ టెక్నాలజీపై రైతులకు అవగాహన కల్పించాలి : మంత్రి టీజీ భరత్
కర్నూల్ బ్యూరో, జూన్ 28, ఆంధ్రప్రభ : వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీని విరివిగా వినియోగించుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ (Minister TG Bharat) అన్నారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో వాడి, వేడిగా కొనసాగింది. సమావేశంలో ప్రధానంగా వ్యవసాయం, వైద్యం, విద్యా ఇతర రంగాలపై నిర్వహించారు. మొదట వ్యవసాయంపై సమీక్ష నిర్వహించగా సభ్యులు వాడివేడిగా ప్రశ్నలు కురిపించారు. ఈ సమావేశంలో మంత్రి టీజీ భరత్ తో పాటు కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా, ఎమ్మెల్సీ మధుసూదన్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వర యాదవ్, వాల్మీకి సంఘం చైర్మన్ బొజ్జమ్మ, కర్నూలు, నంద్యాల జిల్లాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వ్యవసాయం (agriculture) పై జరిగిన చర్చలో భాగంగా డ్రోన్ల మంజూరుకు సంబంధించి జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం 35 కాగా, ఇందులో 17 గ్రూపులను ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి వివరించగా, మిగిలిన రైతు గ్రూపులను కూడా త్వరితగతిన ఏర్పాటు చేసి లక్ష్యాన్ని సాధించాలని మంత్రి జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. డ్రోన్ స్ప్రేయర్ ల వల్ల కలిగే ప్రయోజనాలు, లబ్ది గురించి మండల వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
ఎన్టీఆర్ వైద్యసేవ పథకం ద్వారా నెట్వర్క్ ఆస్పత్రులలో రోగుల నుండి డబ్బు తీసుకుంటున్నారని ఆదోని ఎమ్మెల్యే ప్రస్తావించగా మంత్రి స్పందించి పథకం సక్రమంగా అమలయ్యేలా విజిలెన్స్ కమిటీ (Vigilance Committee) ని వేసి పర్యవేక్షించాలన్నారు. ప్రభుత్వ ఆసుప్రతుల్లో ఆక్సిజన్ అంశంలో లక్షలు, కోట్లు ఖర్చు పెడుతున్నారని, అంత ధర ఉందా అని ఈ అంశం మీద దృష్టి పెట్టి, వెరిఫై చేయాలని మంత్రి డీఎంహెచ్ఓ ను ఆదేశించారు. ఆస్పత్రుల్లో ఐసీయూ, తదితర విభాగాలకు సంబంధించిన ముఖ్యమైన పరికరాలను ఏఏంసీ లో కాకుండా సీఏంసీలో తీసుకోవాలని మంత్రి సూచించారు.
పారిశుద్ధ్యం అంశంపై చర్చలో భాగంగా బ్లీచింగ్ పౌడర్ (Bleaching powder) లో నాణ్యత ఉండాలని, స్థానికంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే చోట నుంచి నాణ్యత గా ఉన్న బ్లీచింగ్ పౌడర్ సరఫరా చేస్తే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని మంత్రి తెలిపారు. విద్యపై చర్చలో భాగంగా ఉమ్మడి జిల్లాలో 20నుండి 25 సంవత్సరాలు దాటిన పాఠశాలల భవనాల స్థితిని తనిఖీ చేయించాలని మంత్రి ఉమ్మడి జిల్లాల డీఈఓ (DEO) లను ఆదేశించారు. పాతపడిన భవనాల్లో పిల్లలకు ప్రమాదాలు జరుగకుండా ముందుగానే ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
హంద్రీ నది మొదలు నుండి ఓల్డ్ టౌన్ చివర తుంగభద్రలో కలిసే వరకు సిల్ట్ బాగా పెరిగిపోయిందని, కొంచెం వరద వచ్చినా, సమీపంలో నివాసం ఉండే ఇళ్లల్లోకి నీరు వెళ్లే అవకాశం ఉందన్నారు.. ప్రతిపాదనలు సిద్ధం చేయమని చెప్పామని, చేశారా అని మంత్రి ఇరిగేషన్ ఎస్ఈ ని ఆరా తీశారు.. ప్రతిపాదనలు పంపామని ఎస్ఈ మంత్రి కి తెలుపగా, అందుకు సంబంధించిన ఒక కాపీ తనకు కూడా ఇవ్వాలని మంత్రి ఇరిగేషన్ ఎస్ఈని ఆదేశించారు.
