గొల్లపూడిలో ఎగ్జిబిషన్ ప్రారంభం

ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే విజయవాడ ఉత్సవ్ లక్ష్యం
మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వెల్లడి

( ఆంధ్రప్రభ, విజయవాడ రూరల్) : నగరాన్ని ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే “విజయవాడ ఉత్సవ్” లక్ష్యం.. అని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ్‌లో భాగంగా గొల్లపూడిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కూటమి నాయకులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ గొల్లపూడి ఎగ్జిబిషన్ వినోదానికి మాత్రమే కాకుండా, విజ్ఞానానికి కూడా వేదికగా మారనుందని, పిల్లలు, యువత, కుటుంబ సభ్యులు అందరూ ఆనందించగల సమగ్ర వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు.

సాంస్కృతిక, శాస్త్రీయ, విద్యా ప్రదర్శనలతో పాటు, స్థానిక కళాకారులు, వ్యాపారవేత్తలకు తమ ప్రతిభను మరియు ఉత్పత్తులను ప్రదర్శించే ప్రత్యేక వేదిక లభిస్తుందని అన్నారు. విజయవాడ ఉత్సవ్ లక్ష్యం నగరాన్ని ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లడమేనని, ఆ దిశగా గొల్లపూడి ఎగ్జిబిషన్ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు.

ఎగ్జిబిషన్‌లో వినోద పార్క్, హ్యాండిక్రాఫ్ట్స్, ఫుడ్ స్టాళ్లు, టెక్నాలజీ ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తక ప్రదర్శనలు వంటి అనేక ఆకర్షణలు ఏర్పాటు చేశామని తెలిపారు.దసరా ఉత్సవాల సందడి నడుమ విజయవాడ ప్రజలకు ఇది ఒక విభిన్నమైన అనుభూతిని అందిస్తుందని పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవ్ ను ప్రతిబింబించేలా గొల్లపూడి ఎగ్జిబిషన్ ప్రత్యేకంగా నిలుస్తుందని, అన్ని వయసుల వారిని ఆకట్టుకునేలా వైవిధ్యభరితమైన అంశాలు సమకూర్చినట్లు నిర్వాహకులు తెలిపారు.గొల్లపూడి ఎగ్జిబిషన్‌కు ప్రజలందరినీ ఆహ్వానించిన ఆయన విజయవాడ ఉత్సవ్ విజయవంతం కావడానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.