మే 9 వరకు రైతు వారోత్సవాలు

మే 9 వరకు రైతు వారోత్సవాలు

  • ఏంఏవో రమ్యశ్రీ

కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ: ఆరుగాలం శ్రమించే అన్నదాతకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 4 వ తేదీ నుండి 9వ తేదీ వరకు కమ్మర్ పల్లి మండలంలో రైతు వారోత్సవాలు నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయ అధికారిని టి. రమ్యశ్రీ ఆదివారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేడు చౌటుపల్లి, ఉప్లూర్, కోనా సముందర్, కమ్మర్ పల్లి గ్రామాలలోని రైతు వేదికలలో రైతు వారోత్సవాలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. రైతు వారోత్సవాలలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, విత్తనాల సరఫరా, ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన,
ఉద్యానవన శాఖ ద్వారా ఆయిల్ ఫామ్ సాగుచేసే పద్ధతులు,ఆయిల్ ఫామ్ ఉత్పత్తిదారుల సంఘం సభ్యులను, పట్టు పరిశ్రమ సాగు చేసే రైతులకు సబ్సిడీపై అవగాహన కల్పించనున్నారు.

పశు సంవర్ధక శాఖ తరపున పశు వైద్య సేవలు,గొర్రెలు, మేకలు, పశువుల పెంపకం దారులపై చర్చ, మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారుల సంఘం పై చర్చ, నేల ఆరోగ్యం, సమతుల్య ఎరువుల వినియోగం, సహజ వ్యవసాయం, పంట రుణాలు, సహకార సంఘాలు, ఎఫ్పివోలు, మార్కెటింగ్ అవకాశాలు, సౌరశక్తి, యాంత్రీకరణ, డ్రోన్లు తదితర అంశాలపై శాస్త్రవేత్తలు, వివిధ శాఖల అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచడంతో పాటు,అర్హులైన ప్రతి రైతుకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని,మే 9 వరకు జరిగే ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.