రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు

రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు

​-చిన్న కొండూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన
-నెల రోజులుగా తూకాలు లేక రైతుల అవస్థలు, పట్టించుకోని పాలకులు, అధికారులు
-క్వింటాకు 8 కిలోల కోతపై ఆగ్రహం
-మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

​చౌటుప్పల్, ఆంధ్రప్రభ : “గొడ్డు ఏడ్చిన ఏ దొడ్డి బాగుపడలే.. రైతు ఏడ్చిన ఏ రాజ్యం బాగుపడలే” అని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం చౌటుప్పల్ మండలం చిన్న కొండూరు గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్న అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ​ధాన్యం కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తూ రైతులను నయవంచనకు గురిచేస్తోందని ఆయన మండిపడ్డారు. రైతులు ధాన్యం కేంద్రాలకు తీసుకొచ్చి 30 రోజులు గడిచినా తూకాలు వేయకపోవడం దారుణమన్నారు. మండుతున్న ఎండలో రైతులు అష్టకష్టాలు పడుతున్నా, కొనుగోలు కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు కల్పించడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.

​అక్రమ కోతలతో రైతులకు నష్టం
తాలు పేరుతో క్వింటాకు 8 కిలోల వరకు కోత విధించడం ద్వారా రైతులను నిలువునా ముంచుతున్నారని ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. యంత్రాల లోపాలు, సిబ్బంది కొరత సాకుతో కొనుగోలు ప్రక్రియను నత్తనడకన సాగిస్తున్నారని విమర్శించారు. తక్షణమే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, తూకాల్లో పారదర్శకత పాటించాలని అధికారులను డిమాండ్ చేశారు. రైతులకు నీడ, తాగునీరు వంటి కనీస సదుపాయాలు కల్పించాలని, చెల్లింపులు నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే రైతు కుటుంబం నుంచి వచ్చానని చెప్పుకోవడం తప్ప, క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.
​రైతుల పట్ల ప్రభుత్వం ఇదే విధమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తే, రానున్న రోజుల్లో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు వాకిటి భూపాల్ రెడ్డి, ఢిల్లీ మాధవరెడ్డి, గుండెబోయిన ఇస్తారు యాదవ్, ఆల్మాస్పేట కృష్ణ, బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి తదితర రైతులు పాల్గొన్నారు.

Leave a Reply