KRTC BUS FLIP | అందరూ బతికారు
- కర్నూలు జిల్లా తుగ్గలిలో ఘోర ప్రమాదం
- స్టీరింగ్ రాడ్ విరిగి కన్నడ బస్సు పల్టీ
- 29 మంది ప్రయాణికుల కథ సుఖాంతం
KRTC BUS FLIP | తుగ్గలి, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా తుగ్గలి మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం (Serious road accident) కలవరం సృష్టించింది. ప్రాణభీతితో 29 మంది అల్లాడి పోయారు. అదృష్టవశాత్తు అందరూ ప్రాణాలతో బయట పడ్డారు. అనూహ్యంగా అలజడి రేపిన ఈ దుర్ఘటన వివరాలు ఇలా ఉన్నాయి, బెంగళూరు నుంచి మంత్రాలయానికి వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు శనివారం తెల్లవారుజామున రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురైంది. బస్సు స్టీరింగ్ రాడ్ అకస్మాత్తుగా విరిగిపోవడంతో డ్రైవర్ కంట్రోల్ కోల్పోయాడు. దిక్కుతోచని స్థితిలో బస్సు రోడ్డు పక్కనే పొలాల్లోకి దూసుకెళ్లి పల్టీ కొట్టింది. ఈ బస్సులో ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో హాహాకారాలు చేశారు. బస్సులో మొత్తం 29 మంది ప్యాసింజర్లు ఉన్నారు. అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం తప్పింది. వీరిలో కిరణ్, అనుశ్రీ అనే ఇద్దరికే స్వల్ప గాయాలు అయ్యాయి. మిగతా ప్రయాణికులు క్షేమంగానే బయటపడ్డారు. ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడం స్థానికులే కాదు, పోలీసు సిబ్బందికి కూడా ఊపిరిపీల్చుకున్నారు.
అకస్మాత్తుగా కీలకమైన స్టీరింగ్ రాడ్ తెగిపోవడం ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే పరిస్థితి సృష్టించిందని ఘటన స్థలంలో పరిశీలించిన అధికారులు తెలిపారు. వాహనం నిర్వహణపై ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఇటీవలి కాలంలో ఆర్టీసీ బస్సుల మెకానికల్ లోపాల కారణంగా ప్రమాదాలు పెరగడం ఈ ఘటనతో మరోసారి వెలుగులోకి వచ్చినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు (The police) దర్యాప్తు ప్రారంభించారు.


