ఉమ్మడి వరంగల్ బ్యూరో, ఆంధ్రప్రభ : కవండే సమీపంలో మహారాష్ట్ర – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులు ఉన్నట్లు అందిన విశ్వసనీయ నిఘా ఆధారంగా, అదనపు ఎస్పీ రమేష్ మరియు 12 సీ60 పార్టీలు (300 కమాండోలు), సీఆర్‌పీఎఫ్ నేతృత్వంలోని ఒక ఆపరేషన్ గురువారం నుంచి ప్రారంభించారు. కవాండే , నెల్గుండ నుండి ఇంద్రావతి ఒడ్డు వైపు భారీ వర్షం కురుస్తున్న సమయంలో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు.
శుక్రవారం ఉదయం కార్డన్ వేసి నది ఒడ్డున సోదాలు చేస్తుండగా, మావోయిస్టులు సీ60 కమాండోలపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం ప్రారంభించారు, దీంతో పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. దాదాపు రెండు గంటల పాటు అడపాదడపా కాల్పులు కొనసాగాయి. ఈ ప్రాంతంలో పోలీసుల జరిపిన సోదాల్లో నలుగురు మావోయిస్టుల మృతదేహాలు, ఒక ఆటోమేటిక్ సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, రెండు .303 రైఫిల్ మరియు ఒక భార్మర్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనితో పాటు, వాకీ టాకీలు, క్యాంపింగ్ సామగ్రి, నక్సల్ సాహిత్యం మొదలైనవి సంఘటనా స్థలం నుండి స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.