-అందుబాటులోకి కోవిడ్ రాపిడ్ కిట్స్, మందులు
-కొత్త కోవిడ్ వైరస్ పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలి
విశాఖపట్నం: ఆంధ్ర ప్రభబ్యూరో – మూడేళ్ల కిందట ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మరో రూపాంతరం చెంది విజృంభిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైందని విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ కే రాంబాబు తెలిపారు.. సరికొత్త వేరియంట్ జెఏన్ 1, ఎల్ ఎఫ్ 7, ఎన్ బి 1.8 ఆందోళన కలిగిస్తున్న తరుణంలో ప్రభుత్వం ఆదేశాల మేరకు విమ్స్ ఆస్పత్రిలో 20 పడకలతో ప్రత్యేక వార్డు సిద్ధం చేసినట్లు తెలిపారు.
నగరంలో ఒక కేసు నమోదు కావడంతో కోవిడ్ వైద్య పరీక్షల నిమిత్తం రాపిడ్ కిట్లను కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చామన్నారు.. రాపిడ్ కిట్ లో పాజిటివ్ అని వస్తే వెంటనే ఆర్టిపిసిఆర్ పరీక్షలకు పంపించి కోవిడ్ నిర్ధారణ చేయనున్నట్లు తెలిపారు.. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా కోవిడ్ రోగులకు వైద్యం అందించేందుకుగాను వైద్యులకు సిబ్బందికి పిపి కిట్లను.. రోగులకు అవసరమైన మందులను సమకూర్చుకోవడం జరిగిందన్నారు..
కోవిడ్ కొత్త వేరియంట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. భౌతిక దూరం పాటిస్తూ సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కోరారు.. వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఇళ్లకే పరిమితం అవ్వాలన్నారు.. అత్యవసరం మినహా సరదాల కోసం బయట తిరగరాదన్నారు.. మాస్కుల వినియోగం ,నిరంతరం శానిటేషన్ చేసుకోవడం తప్పనిసరి అని సూచించారు…