july6th indrakeeladri | ఇంద్రకీలాద్రిపై భక్తుల వెల్లువ..
65 వేల మందికి పైగా కనకదుర్గమ్మ దర్శనం
వీఐపీ, అంతరాలయ దర్శనాలు రద్దు..
సామాన్య భక్తులకు పెద్దపీట
11,300 మందికి నిత్య అన్నదానం..
అధికారుల సమన్వయంతో రద్దీ నియంత్రణ..
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
july6th indrakeeladri |ఇంద్రకీలాద్రి ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో కనకదుర్గమ్మ దర్శనానికి ఆదివారం భక్తుల తాకిడి భారీగా నమోదైంది. వారాంతపు సెలవు దినం కావడంతో తెల్లవారుజాము నుంచే రాష్ట్రం నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఉదయం నుంచే అన్ని క్యూలైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థాన అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. వీఐపీ ప్రోటోకాల్ దర్శనాలు, అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేసి సామాన్య భక్తులందరికీ అమ్మవారి ముఖమండప దర్శన భాగ్యం కల్పించారు. పాలకమండలి సభ్యులు, ఆలయ అధికారులు, సిబ్బంది సమన్వయంతో క్యూలైన్లను సమర్థంగా నిర్వహించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు.

దేవస్థానం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆదివారం 65,001 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 10,947 దర్శన టికెట్లు జారీ కాగా, 1,05,321 ప్రసాదాల యూనిట్లు విక్రయమయ్యాయి. హుండీ, విరాళాల రూపంలో రూ.24,02,726 ఆదాయం లభించింది. వివిధ ఆర్జిత సేవల్లో 421 మంది పాల్గొనగా, 3,498 మంది తలనీలాలు సమర్పించారు. నిత్య అన్నదాన పథకం ద్వారా 11,300 మంది భక్తులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో ఆలయ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టి దర్శనం సజావుగా సాగేలా చర్యలు కొనసాగించారు.









