వృద్ధ మహిళపై దాడి.. బంగారు ఆభరణాల చోరీ
- 24 గంటల్లో కేసు ఛేదించిన కరీంనగర్ పోలీసులు.. నిందితుడి అరెస్ట్
కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ : వృద్ధ మహిళపై దాడి చేసి బంగారు ఆభరణాలు చోరీ చేసిన కేసును కరీంనగర్ త్రీటౌన్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నిందితుడిని అరెస్టు చేసి, నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. త్రీటౌన్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీఐ ఏ. తిరుమల్ వివరాలు వెల్లడించారు.
కిసాన్‌నగర్‌కు చెందిన మునుగొండ మధుకర్ శుక్రవారం మధ్యాహ్నం ముఖానికి మాస్క్ ధరించి బాధితురాలి ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమె అరవకుండా అడ్డుకుని మెడలోని బంగారు గొలుసు, ఎడమ చెవికి ఉన్న బంగారు చెవికమ్మను బలవంతంగా దోచుకున్నాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమె తలను గోడకు కొట్టడంతో గాయాలయ్యాయి. అనంతరం నిందితుడు దుస్తులు మార్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
చోరీ చేసిన బంగారు ఆభరణాలను ఓ బజాజ్ ఫైనాన్స్ సంస్థలో తాకట్టు పెట్టి రూ.2.25 లక్షలను తన బ్యాంకు ఖాతాలో జమ చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కేసు నమోదు చేసిన పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి సీసీ కెమెరాల దృశ్యాలు, సాంకేతిక ఆధారాలు, సాక్షుల సమాచారం, బ్యాంకు లావాదేవీలను విశ్లేషించారు. వీటి ఆధారంగా నిందితుడి కదలికలను గుర్తించి 24 గంటల్లోనే అరెస్టు చేశారు.
బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉంటున్న విషయాన్ని ముందుగానే తెలుసుకున్న నిందితుడు పథకం ప్రకారం ఈ నేరానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని సీఐ తెలిపారు. తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు సంబంధిత బ్యాంకు, ఆర్థిక సంస్థ రికార్డులను సేకరించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.
నిందితుడిని త్వరగా అరెస్టు చేసిన త్రీటౌన్ ఇన్‌స్పెక్టర్ ఏ. తిరుమల్, ఎస్‌ఐ చేరాలు, ఇతర పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
