ఆర్థిక స్వాతంత్ర్యంతోనే మహిళా సాధికారత..
- మహిళలు తమ ఆర్థిక వ్యవహారాలపై పూర్తి పట్టు సాధించాలి: కిరణ్ బేడీ
- సైబర్ నేరాలు, సామాజిక మాధ్యమాల వినియోగంపై అవగాహన అవసరం
విజయవాడ, ఆంధ్రప్రభ : మహిళలు ఆర్థిక స్వాతంత్ర్యం సాధించినప్పుడే నిజమైన సాధికారత సాధ్యమవుతుందని పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారిణి డాక్టర్ కిరణ్ బేడీ అన్నారు. స్వయం సమృద్ధి ద్వారా మహిళలు తమ జీవితాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదగాలని సూచించారు.
బందరు రోడ్డులోని గేట్వే హోటల్లో ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మహిళా సదస్సులో కిరణ్ బేడీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రారంభమైన రెండేళ్లలోనే ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ యువ మహిళా పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయమన్నారు. సమాజ అభివృద్ధితో పాటు దేశ ఆర్థిక వ్యవస్థలోనూ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
ఆర్థిక వ్యవహారాలపై పట్టు అవసరం
మహిళలు తమ వ్యాపార, ఆర్థిక వ్యవహారాలను ఇతరులపై పూర్తిగా ఆధారపడకుండా స్వయంగా పర్యవేక్షించాలని కిరణ్ బేడీ సూచించారు. ఆర్థిక నిర్ణయాధికారాన్ని తమ చేతుల్లోనే ఉంచుకోవాలని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరాలు, సామాజిక మాధ్యమాల వినియోగంపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సమస్య తలెత్తిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే ప్రమాదాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడం ముఖ్యమని కిరణ్ బేడీ పేర్కొన్నారు. ఏ రంగంలోనైనా ముందస్తు ప్రణాళిక, సమగ్ర సన్నాహాలు విజయానికి కీలకమని చెప్పారు.
జైళ్లలో శిక్షణ, సంక్షేమ కార్యక్రమాలు
పోలీస్ శాఖ, స్వచ్ఛంద సంస్థల సహకారంతో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు జైళ్ల వ్యవస్థను మెరుగుపరిచేందుకు, ఖైదీల పిల్లల విద్యకు సహకరించేందుకు తమ ‘ఇండియా విజన్ ఫౌండేషన్’ సిద్ధంగా ఉందని కిరణ్ బేడీ తెలిపారు. విజయవాడ ఫిక్కీ ఫ్లో, డీసీపీ కేజీవీ సరిత, ఇండియా విజన్ ఫౌండేషన్ ప్రతినిధులు కలిసి విజయవాడ లేదా రాజమండ్రి జైలు ప్రాంగణాల్లో త్వరలో ప్రత్యేక శిక్షణ, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో ఫిక్కీ ఫ్లో విజయవాడ చాప్టర్ చైర్పర్సన్ సుప్రియ మలినేని, ఫౌండేషన్ ప్రతినిధులు, మహిళా పారిశ్రామికవేత్తలు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

