పంటల బీమా తప్పనిసరిగా చేసుకోవాలి..
- డ్రిప్ ,స్పింకర్లు ,మల్చింగ్ ద్వారా నీటి పొదుపు పాటించాలి
- ఎరువుల అధిక వాడకం తగ్గించాలి
- వర్షాభావ పరిస్థితులపై రైతులతో అవగాహన కార్యక్రమం
- ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య
జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచించే సలహాలు, సూచనలు పాటిస్తూ రైతులు అధిక దిగుబడులు సాధించాలని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) కోరారు. శనివారం ‘రైతన్న మీకోసం’ ఎల్నినో ప్రభావ నివారణ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామంలో నిర్వహించిన క్షేత్రస్థాయి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో కలిసి ఎమ్మెల్యే తాతయ్య గ్రామంలో సాగులో ఉన్న పత్తి పంటలను పరిశీలించారు. ఎల్నినో ప్రభావంతో నెలకొన్న వాతావరణ పరిస్థితులు, వర్షాభావం కారణంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. పంటల పరిస్థితిని పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలని సూచించారు. శాస్త్రవేత్తల సూచనల మేరకు పొలాల్లో మట్టి నమూనాలను పరీక్షలు చేయించి, ఆ ఫలితాల ఆధారంగానే ఎరువులను వినియోగించాలని కోరారు. ఎరువుల అధిక వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడులు సాధించేందుకు బిందు సేద్యం, తుంపర సేద్యం వంటి పద్ధతులను అవలంబించాలని చెప్పారు.
రైతుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని తాతయ్య తెలిపారు. ఇందులో భాగంగానే రైతులతో ముఖాముఖి సమావేశాలు, క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని వర్షాభావ పరిస్థితులను తట్టుకునే ప్రత్యామ్నాయ పంటలను, తక్కువ కాలపరిమితి కలిగిన రకాలను రైతులు ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. వారి సూచనల మేరకు పంటల సాగులో మార్పులు చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా కొందరు రైతులు ఎరువుల కొరత సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. విషయాన్ని సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు.
కార్యక్రమంలో జగ్గయ్యపేట మండల పార్టీ అధ్యక్షుడు కట్టా వెంకట నరసింహారావు, ఆచార్య ఎన్.జీ. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి పాలడుగు సత్యనారాయణ, పరిశోధనా విభాగం సంచాలకుడు రామచంద్రరావు, డీఈఓ సీహెచ్ తిరుమలాదేవి, ఏడీఆర్ దుర్గాప్రసాద్, జగ్గయ్యపేట ఏడీఏ దుర్గాభవాని, గరికపాడు శాస్త్రవేత్తలు, జగ్గయ్యపేట వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
