రైతన్నలకు శుభవార్త.. రేపే కడెం నీటి విడుదల

జన్నారం, ఆంధ్రప్రభ : కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఆదివారం ఉదయం 10.30 గంటలకు ప్రాజెక్టు కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేయనున్నట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజ్మీర నందునాయక్ శనివారం సాయంత్రం తెలిపారు.

ఆయకట్టు రైతాంగం వరి పంట సాగు ప్రయోజనాల కోసం నీటిని విడుదల చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా నిర్మల్ జిల్లాలోని కడెం, దస్తురాబాద్, మంచిర్యాల జిల్లాలోని జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల రైతులకు సాగునీరు అందనుంది.

రైతులు ఈ సాగునీటిని సద్వినియోగం చేసుకుని వరి పంటలో అధిక దిగుబడులు సాధించాలని ఎమ్మెల్యే బొజ్జు పటేల్, అజ్మీర నందునాయక్ కోరారు. సాగునీటి విడుదల కార్యక్రమానికి రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.