కలెక్టర్‌ను కలిసి ఖమ్మం సమస్యలపై వినతి
కీలక పనులకు వేగం పెంచాలని విజ్ఞప్తి
నగరాభివృద్ధిపై వరుస ప్రతిపాదనలు
సానుకూలంగా స్పందించిన కలెక్టర్
ఖమ్మం, ఆంధ్రప్రభ : ఖమ్మం నియోజకవర్గ అభివృద్ధి పనులపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ తుమ్మల యుగంధర్ ప్రత్యేక దృష్టి సారించారు. పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేసి ప్రజలకు మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ శుక్రవారం జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్‌ను కలిశారు. నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిని కలెక్టర్‌కు వివరించారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారిశుధ్యం, టౌన్ ప్లానింగ్, విద్యుత్ సంబంధిత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అభివృద్ధి పనుల విషయంలో అధికార యంత్రాంగం సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
ఖమ్మం నగరానికి ప్రత్యేక ఆకర్షణగా మారనున్న ఖిల్లా రోప్‌వే పనులను వేగవంతం చేయాలని యుగంధర్ కోరారు. స్థలాలు కేటాయించిన వారికి ఎన్‌వోసీల మంజూరు ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని విజ్ఞప్తి చేశారు. కేబుల్ బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, నిర్మాణానికి సహకరించిన వారికి నూతన షాపులు మంజూరు చేయాలని సూచించారు. అండర్‌డ్రైనేజీ, రిటైనింగ్ వాల్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. మైనారిటీల కోసం నూతన షాదీఖానా నిర్మాణానికి స్థలం కేటాయించాలని, మయూరి సెంటర్ అండర్ బ్రిడ్జి, బైపాస్ రోడ్డు బ్రిడ్జి ప్రాంతాల్లో అభివృద్ధి పనులను త్వరగా చేపట్టాలని కోరారు.
రఘునాథపాలెం మండలంలోని గ్రామపంచాయతీల పరిధిలో అభివృద్ధి పనులకు మరింత వేగం పెంచాలని యుగంధర్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ కింద నూతన ఓటర్ల నమోదు ప్రక్రియను నిర్ణీత లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని యుగంధర్ తెలిపారు. ఆయన ప్రతిపాదనలపై కలెక్టర్ దివాకర్ సానుకూలంగా స్పందించి, ఖమ్మం నియోజకవర్గంలోని అభివృద్ధి పనులను త్వరలోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
