Vaibhav Sooryavanshi | టీమిండియా పిలుపు వచ్చేసింది…
Vaibhav Sooryavanshi | టీమిండియా పిలుపు వచ్చేసింది…
- ఐపీఎల్ సెన్సేషన్‌కు జాతీయ జట్టులో చోటు
- వైభవ్ సూర్యవంశీ రికార్డు..
యువ టాలెంట్ వైభవ్ సూర్యవంశీ మరో భారీ మైలురాయికి చేరువయ్యాడు. ఇటీవల ఐపీఎల్లో ప్రపంచ స్థాయి బౌలర్లను సైతం ఉతికారేసి క్రికెట్ ప్రపంచం దృష్టిని తనవైపు తిప్పుకున్న ఈ 15 ఏళ్ల సంచలనం.. ఇప్పుడు టీమిండియా సీనియర్ జట్టులో చోటు దక్కించుకుని మరో అరుదైన ఘనత సాధించాడు. అతడి ఆట తీరు, విధ్వంసకర బ్యాటింగ్ చూస్తుంటే.. నన్ను ఎంపిక చేయకుండా ఉండలేరు అని సెలెక్టర్లకు సవాల్ విసిరినట్టే కనిపిస్తోంది. దీంతో ఈ యువ ఓపెనర్.. ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో జరిగే టీ20 సిరీస్‌ల కోసం భారత జట్టుకు ఎంపికయ్యాడు.
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్.. 776 పరుగులు సాధించి టోర్నీలో అత్యంత విలువైన ఆటగాడి (MVP) అవార్డును సొంతం చేసుకున్నాడు. 237.30 స్ట్రైక్‌రేట్‌తో బౌలర్లపై విరుచుకుపడిన అతడి బ్యాటింగ్ ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించింది.
అంతకుముందు అండర్-19 ప్రపంచకప్‌లోనూ వైభవ్ మెరుపులు మెరిపించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో 175 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడి భారత జట్టుకు ప్రపంచకప్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అదే ప్రదర్శన ఇప్పుడు అతడిని నేరుగా సీనియర్ జట్టులోకి తీసుకొచ్చింది.
జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్‌తో బెల్ఫాస్ట్లో జరిగే రెండు టీ20 మ్యాచ్‌ల్లో వైభవ్ అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత జూలై 1 నుంచి ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కూడా అతడికి అవకాశం లభించవచ్చు.
వైభవ్ ఈ పర్యటనలో ఒక్క మ్యాచ్ ఆడినా భారత క్రికెట్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన పురుష అంతర్జాతీయ క్రికెటర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 1989లో పాకిస్థాన్‌పై 16 ఏళ్ల 205 రోజుల వయసులో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
ఇదిలాఉంటే, ఈ సిరీస్‌ల్లో భారత జట్టుకు కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించనున్నాడు. టీ20 ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను సెలెక్టర్లు తప్పించగా, జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చారు. హార్దిక్ పాండ్యా కూడా ఈ పర్యటనకు దూరంగా ఉండనున్నాడు. దేశవాళీ క్రికెట్లో రాణించిన అన్క్యాప్డ్ పేసర్ ప్రిన్స్ యాదవ్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు.
వైభవ్ సూర్యవంశీపై ఇప్పటికే భారత క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఐపీఎల్, అండర్-19 స్థాయిలో తన ప్రతిభను నిరూపించిన ఈ యువ సంచలనం.. ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై ఎలా రాణిస్తాడన్నదే ఆసక్తికరంగా మారింది.
