కడెం ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా అడిషనల్ కలెక్టర్

కడెం, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మంగళవారం కడెం మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మొదట కడెం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆయన, రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం కడెం ప్రాజెక్టు సమీపంలోని జీపీ నర్సరీని పరిశీలించి, మొక్కలు ఎండిపోకుండా ప్రతిరోజూ నీరు పోసి సంరక్షించాలని అధికారులకు సూచించారు.

తదుపరి నూతనంగా నిర్మాణం జరుగుతున్న ఇందిరమ్మ పథకం ఇండ్లను పరిశీలించి, పనుల పురోగతిపై లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కడెం కేజీబీవీ పాఠశాలను సందర్శించి, విద్యార్థులకు అందిస్తున్న బోధన విధానం, అమలు చేస్తున్న మెనూపై ఆరా తీశారు.

ఈ కార్యక్రమంలో కడెం తహసీల్దార్ ఎం. లచ్చిరాం, ఎంపీడీవో సునీత, ఎంపీవో శ్రీనివాస్, ఎంఈఓ షేక్ హుస్సేన్, ఈజీఎస్ ఏపీఓ జయదేవ్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ శివకుమార్, గృహ నిర్మాణ శాఖ ఏఈ వంశీ, కేజీబీవీ ఎస్‌ఓకే విమల, పంచాయతీ కార్యదర్శి ఎండి మునరుల్ హసన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply