వయసు మనసుకు కాదు శరీరానికి సంబంధించినది. ఈ విషయంలో ఒక్కొక్కరి దృక్పథం ఒక్కో లాగా ఉండొచ్చు. కానీ పట్టించుకోకపోతే మనిషికి వయసొక సంఖ్య మాత్రమే. వృద్ధాప్యం నుంచి ఎవరికీ మినహాయింపు ఉండదు. కనుక దాన్ని ఎవరూ శాపంగా పరిగణించాల్సిన అవసరం లేదు. నిజానికి దాన్ని ఒక అద్భుతమైన దశగా మలుచుకోవాలి. అదొక అందమైన దశ కూడా! మనిషికి అన్ని దశలు ప్రకృతి ఇచ్చిన బహుమతులే. ఎదగడం వేరు, వృద్ధాప్యాన్ని ఆపాదించుకోవడం వేరు.
మహా కవి సినారె అన్నట్లు, ‘ముడతలు ముఖానికే కానీ మనసుకు కాదు!’ వయసు పెరుగుతున్నా హృదయానికి ఎలాంటి ముడతలు పడకుండా ఉంచుకోవడం ముఖ్యం. ‘ఫీల్ యంగ్ వైల్ గ్రోయింగ్ ఓల్డ్!’ అనేది నేడు ప్రతి వ్యక్తి మనసా, వాచా, కర్మణా అనుసరించాల్సిన సాధారణ విషయం. ఎంత అనుకుంటే అంత వయస్సు మనిషికి. ఇరవైలో అరవైలా కాదు, అరవైలో ఇరవైలా ఉండాలనే ప్రాతిపదికపై జీవించే ప్రయత్నం చేయాలి. వృద్ధ యువకులు అనే భావనతో జీవించాలి. తలచుకుంటే ఇది కష్టతరమూ కాదు, అసాధ్యం అసలే కాదు.
మన ఇంట్లో మనం కాలం చెల్లిన పాత వస్తువులలా కాదు. కాలంతో పరిపక్వత చెందిన ‘వైన్’లా విలువ పెరిగిన వాళ్లం. చీకటి ఎప్పుడూ మెల్ల మెల్లగా ముసురుకుంటుంది. అలాగే వృద్ధాప్యం కూడా. జీవితం ఒక సాహస యాత్ర! కండబలం తగ్గిన కొద్దీ బుద్ధిబలానికి పదును పెడుతూ సాగే మహా యాత్ర. అందం విచ్చుకునే వయసు యువతదైతే, లోపలి వైపు అందంగా ముడుచుకొని దాక్కునే అలంకారం వృద్ధాప్య సౌందర్యం. అప్పుడు బహిర్గతం, ఇప్పుడు అంతర్గతం! శారీరకంగా కన్నా, మానసిక ఆరోగ్యమే అసలైన అందం, ప్రత్యేకంగా వృద్ధాప్యానికి. ఆరోగ్యకరమైన వ్యక్తులే అందంగా ఉంటారనేది నిజంగా నిజం! అందం తలపుకు రాగానే తరచూ యువత గుర్తుకొస్తుంది, యవ్వనాన్ని అందానికి ప్రతీకగా భావిస్తారు కనుక. కానీ యవ్వనం అనేది అందం ఉట్టిపడే ఏకైక దశ కాదు. అందానికి వయసు లేదు. పసి ప్రాయం మొదలుకొని పండిన ప్రాయం వరకు బహిర్గతం నుంచి అంతర్గతంగా స్థానభ్రంశం చెందినా, అందానికి ప్రమాణం మారదు. శక్తి లాగా అందం ఎప్పుడూ పరిరక్షించబడుతుంది! లైక్ ఎనర్జీ, బ్యూటీ ఈజ్ ఆల్వేజ్ కంజర్వుడ్!
అనుభవాల నిధులు
వృద్ధాప్యం ఓ ప్రత్యేక కళారూపం! అంతులేని అనుభవాల గని. సాయం సంధ్యలో మార్పులను ఆస్వాదిస్తూ ఆహ్వానించే వయసు. ప్రతి రోజు వయసుతో పాటు కొత్తదనమూ పెరుగుతుంది. యవ్వన దశలో ఉన్నప్పుడు నేర్చుకున్న వాటిని వృద్ధాప్యంలో అర్థం చేసుకొని జీర్ణించుకుంటారు. వృద్ధాప్యం యొక్క ప్రథమ లక్ష్యం… జ్ఞాన సముపార్జనతో వ్యక్తిగత ఔన్నత్యాన్ని చేరుకోవడం, ఆ తరువాత తరువాత భావోద్వేగాన్ని అనుసరించి జీవితాన్ని కొనసాగించడం.
వయోవృద్ధులు తమ విశాలమైన అనుభవంతో జీవితం గురించి దృఢమైన అవగాహన కలిగి ఉంటారు. వారు అందించే సలహాలు, సూచనలు నేటి యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. సమస్యలను దార్శనిక దృక్పథంతో పరిష్కరించే మార్గాలను సూచిస్తారు. యువతకు జీవన పాఠాలు చెబుతారు. తాము స్వంతంగా పాటించే జీవన విధానాలను వారికి ఆదర్శప్రాయంగా నిలుపుతారు. ‘మేము చెప్పినట్లు చేయండి’ అని చెప్పకుండా, ‘మేము చేసినట్లు చేయండి’ అనే ఆదర్శానికి నిలువుటద్దాలుగా మారుతారు.
అధ్యయనాల ప్రకారం తేలిన ఓ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచ జనాభాలో అత్యంత సంతోషకరమైన వ్యక్తుల జాబితాలో వృద్ధుల శాతమే ఎక్కువని. అందుకు కారణాలు.. దశాబ్దాల తరబడి ఎన్నో ఢక్కామొక్కీలు తిన్న అనుభవంతో పరిస్థితులను ఎదుర్కునే సమర్థత, సరిపడే ఆర్థిక స్థోమత మరియు వ్యక్తిగత అంతర దృష్టి వలన కావచ్చు. తమను తాము పోషించుకునే ఆర్థిక స్థోమత లేని వృద్ధులు, తమను ఆప్యాయంగా ఆదరించే కుటుంబ సభ్యులు లేని సీనియర్ల పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉండవచ్చని గమనించాలి.
సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు సైనికులు
ఆచార్య వ్యవహారాల కొనసాగింపు ఆషామాషీ వ్యవహారం కాదు. అది కుటుంబ పెద్దల వలలనే సాధ్యం. వారు సమాజపు సాంస్కృతిక సంపదను కాపాడే పాత్రను పోషిస్తారు. సనాతన ఆచారాలను పరిరక్షిస్తూ కొత్త తరాలకు దిశానిర్దేశం చేస్తారు. సనాతన, అధునాతన సంస్కృతులకు వారధిగా నిలుస్తారు.
వృద్ధులు.. పని శూరులు
ఎండిపోయి పుచ్చు పట్టిన కర్ర మొద్దులు కాదు వృద్ధులు, ఏళ్ల అనుభవంతో గడించిన జ్ఞాన పరిమళం గుబాళించే గంధపు కలపలు! వారిని నిర్జీవంగా ఉండే ఆత్మలని భావించడం సరైనది కాదు. పని శుంఠలు అసలే కాదు, నిమగ్నమైతే అనుభవ పూర్ణత్వంతో ముందుకెళ్లే పని శూరులు! వారికి ఉన్న అనుభవం, జ్ఞానం, నైపుణ్యం మరియు కార్య నిర్వహణ దక్షత కుటుంబానికి, సమాజానికి ఎంతో అవసరం. కాలానుగుణంగా వారు ప్రోగుచేసుకున్న ప్రతిభ నిర్వీర్యం కాకుండా, సరిగా వినియోగించుకుంటే సమాజానికి మార్గదర్శకులుగానే కాక, దేశ అభ్యున్నతికే నిర్దేశకులుగా నిలవగలరు. వారి సమర్థతను గుర్తించి గౌరవించడం కుటుంబంలోని అందరి బాధ్యత. ఇంటికి ఎనుగర్ర (వెన్నుకర్ర)లా, ఒంటికి వెన్నెముకలా, ప్రతి వ్యవస్థ యొక్క నిలకడైన మనుగడకు స్థిర రూపాలు వృద్ధులు. వారే కుటుంబానికి బలం, సమాజానికి భరోసా, దేశానికి ఆదర్శమని గమనించాలి. భౌతికంగా ప్రత్యక్ష యుద్ధానికి సరిపడే సత్తా లేకున్నా, రథానికి సారథులుగా, వ్యూహ రచనా నిపుణులుగా వారికి వారే సాటి.
ఉరిమే మేఘం కురిసి కరగొచ్చు. అలాగే ఉరకలు వేసే యవ్వనానికి వేగం తగ్గడం సహజం. చలనంతో రాయైనా అరిగి పరిమాణం తగ్గి క్రమంగా అదృశ్యమైపోతుంది. ఏదీ అలానే ఎప్పటికీ ఉండిపోదు. మనిషి జడ జీవి కాదు. వయసు పెరుగుతున్న కొద్దీ కొన్ని శారీరక బలహీనతలు సాధారణమైనా, ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించడం ద్వారా వృద్ధాప్యాన్ని వాయిదా వేయవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. కొందరు వృద్ధాప్యంలో జీవితాన్ని నెట్టుకుంటూ రావడాన్ని ఓ నరకంగా భావిస్తారు. ఇందుకు శారీరక మరియు మానసిక బలహీనతలు, ఒంటరితనం లేదా వ్యక్తిగత జీవితంలో సంభవించిన ఇతర కష్టనష్టాలు కారణం కావచ్చు. యవ్వనంలో ఉన్నప్పటి ‘అందం మరియు బలం’ వృద్ధాప్యంలో క్షీణ దశకు చేరువవుతున్నందుకు కావచ్చు. కుటుంబం మరియు తమ చుట్టూ ఉన్న సమాజం యొక్క ఆదరణ పొందగలిగే వారికి వృద్ధాప్యం ఓ ‘స్వర్ణ దశ’ అనిపించవచ్చు. గత జీవన విధానం ఈ తీపిచేదుల వృద్ధాప్యాన్ని కొంతవరకు శాసించవచ్చు.
మనస్సు వయసుకు సూచిక!
వృద్ధాప్యాన్ని ఎంత వాయిదా వేయగల్గితే అంత సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అలసిపోయిన శరీరానికి నిద్ర అవసరమైనప్పటికీ కొన్నిసార్లు కేవలం నిద్ర వలన విశ్రాంతి కలగదు. మనస్సు వయసుకు సూచిక కాని వయసు మనస్సుకు కాదు. మనసును శరీరానికి అనుసంధానం చేయాలి. మనస్సు ఒక లాక్కెళ్లే వాహనం (టోయింగ్ వెహికల్) లాంటిది. శరీరంలోని ఏ అవయవాన్నైనా తనతో పాటు తీసుకు వెళ్లే శక్తి ఉంటుంది మనసుకు. వృద్ధాప్యంలో ఇది చాలా అవసరం. అప్పుడే అవయవాల పనితీరుకు, మెదడుకు మధ్య అనుసంధానం కుదురుతుంది. మెదడు ఒత్తిడికి లోనైతే అవయవాల పనితీరు కూడా అదుపు తప్పుతుంది. అంతే కాక పెరుగుతున్న సాంకేతికతకు బానిసై, ఏదో ఒక ఒత్తిడిలోకి జారిపోయే అవకాశం ఉంది. చుట్టూ ఉన్న వాళ్లు చేసే పనులను, వారి అభిరుచులను గుర్తించలేని అయోమయానికి గురయ్యే ప్రమాదముంది. అందుకే మెదడును వీలైనంత చురుగ్గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అగ్నిపర్వతం పొరుగున ఉన్నా జీవించ గలిగే నిబ్బరాన్ని అలవర్చుకోవాలి ఆ వయసులో. ఆరోగ్యమే అన్ని సంతోషాలకు మూల ఔషధమని గ్రహించాలి.
ప్రతి మనిషి చుట్టూ అదృశ్యంగా ఏదో ఒక ‘పొర’ ఉంటుంది. వయసు మీరిన కొద్దీ అది అనుభవ సుగంధ పరిమళాన్ని వెదజల్లుతుంది. అందరిలో కాకున్నా కొందరిలో కొంత వ్యక్తిగత వ్యసన దుర్గంధాన్నీ వెలిబుచ్చుతుంది. అది వ్యక్తి యొక్క హుందాతనం లేదా చాదస్త ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. దశ మారినప్పుడు దిశ మారడం సహజం. ఒకే దశ మళ్లీ మళ్లీ ఎవరికీ రాదు. అదే కాల మహిమ. ‘ఏ దశకు ఆ ముచ్చట!’ అన్నట్లు ప్రతి దశను సాధ్యమైనంత సమర్థవంతంగా ఈదుకుంటూ ముందుకెళ్లడమే ప్రతి జీవితానికి లక్ష్యం. అందువలన మనిషికి వృద్ధాప్యం ఎప్పుడూ కాలం విడిచిన నిట్టూర్పు కాకూడదు, కాలంతో పాటు శ్వాసించే క్రమ జీవితంగా మార్చుకోవాలి. దశ ఏదైనా మనిషికి జీవితం.. కాలం శాసించే శాపం కాదు, కాలం అనుగ్రహించే ఉచ్ఛ్వాస నిశ్వాసాల వరం!
- ఆచార్య కడారు వీరారెడ్డి