CONGRESS | కోటి మహిళలకు కోటి చీరలు పంపిణీ

పిసిసి ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి..
CONGRESS | బిక్కనూర్ ఆంధ్ర ప్రభ : కోటి మహిళలకు కోటి చీరలు పంపిణీ చేయడం ప్రభుత్వము లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి (Indrakaran Reddy) చెప్పారు. ఆదివారం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రంలో మహిళలకు ఇందిరా శక్తి చీరలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు.
ప్రతి మహిళకు ఇంటింటికి వెళ్లి చీరను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. డ్వాక్రా మహిళల ఆధ్వర్యంలో మహిళలకు బొట్టుపెట్టి సారే రూపంలో చీరలను అందజేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
గత ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తుందని చెప్పారు. మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఆర్టీసీలు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమ్ రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు రేఖ, మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సుదర్శన్, సొసైటీ అధ్యక్షులు సుదర్శన్ ,నాయకులు విజయ్ గౌడ్, వెంకటేష్ తదితరులు ఉన్నారు.
