రోడ్డు సమస్యపై వెంటనే స్పందన.. అధికారులతో పరిశీలన

సమస్యను చెప్పిన వెంటనే పరిష్కరించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

విజయవాడ, ఆంధ్రప్రభ: ప్రజా సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను తన దృష్టికి తీసుకురాగానే స్పందించి అధికారులతో పరిష్కార చర్యలు చేపట్టారు.

మంగళవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్‌ రామలింగేశ్వర నగర్‌ రుద్రభూమి మెయిన్‌ గేటు ప్రాంతంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పర్యటించారు. స్థానికులతో మాట్లాడి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత అధికారులకు సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అనంతరం డివిజన్‌లో నిర్వహించిన టీడీపీ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.

ఈ సందర్భంగా గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ.. రామలింగేశ్వర నగర్‌ ప్రాంతంలో డ్రైనేజీ సౌకర్యం కల్పించేందుకు సిమెంట్‌ రోడ్డును తవ్వి ట్రంక్‌ లైన్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ ట్రంక్‌ లైన్‌ ద్వారా వందల సంఖ్యలో ఇళ్లకు డ్రైనేజీ కనెక్షన్లు కల్పించే అవకాశం ఉంటుందని చెప్పారు.

డ్రైనేజీ పనుల అనంతరం సాధారణంగా ఆరు నెలల వ్యవధిలో అధికారులు రోడ్డు నిర్మాణం చేపడతారని, అయితే ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అప్పటి వరకు తాత్కాలికంగా రోడ్డు నిర్మించాలని మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. బుధవారం నుంచే తాత్కాలిక రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభిస్తారని చెప్పారు.

డ్రైనేజీ కనెక్షన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత శాశ్వతంగా రోడ్డు నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే వివరించారు. అప్పటి వరకు ప్రజలు సహకరించాలని కోరారు.

ఈ సందర్భంగా స్థానికురాలు గాదిరెడ్డి అమ్ములు మాట్లాడుతూ.. డ్రైనేజీ పనుల కోసం రోడ్డు తవ్వడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని సోమవారం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మంగళవారం ఉదయం అధికారులతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించి రోడ్డు నిర్మాణానికి ఆదేశాలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. సమస్యను చెప్పిన వెంటనే పరిష్కార చర్యలు తీసుకున్న ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మూల్పూరి కళ్యాణి, సింగంశెట్టి రమేష్, రత్నం రమేష్, ముమ్మనేని ప్రసాద్, కట్టంపూడి శేషుబాబు, రాధాకృష్ణ, షర్టు శ్రీను, గోగుల యేసు, నిమ్మల హేమ, చిన్నం ఈశ్వరరావు, కొడాలి సోము, ముద్దునేని వంశీ, గల్లా రవి, గాదం ప్రసాద్, ఈఈ రామారావు, ఏఈ జస్వంత్‌ తదితరులు పాల్గొన్నారు.