శాస్త్రీయ ఆలోచనలకు ఊతమివ్వాలి: పవన్ కల్యాణ్
సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధిపై పవన్ కల్యాణ్ సమీక్ష
మంగళగిరి, ఆంధ్రప్రభ: సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ శాఖ కార్యదర్శి డాక్టర్ హనుమంతు పురుషోత్తంను ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
పరిశోధన, ఆవిష్కరణలకు అనుకూల వాతావరణాన్ని కల్పించడం, విద్యార్థులు, యువ పరిశోధకులకు మరిన్ని అవకాశాలు అందించడం వంటి అంశాలపై సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్రంలో శాస్త్రీయ పరిశోధనలకు ప్రోత్సాహం కల్పించడంతో పాటు కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని పవన్ కల్యాణ్ సూచించారు.
అదేవిధంగా యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. విద్యార్థులు, యువ పరిశోధకులు తమ ప్రతిభను చాటుకునేందుకు అవసరమైన వేదికలు, అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
