నందికొట్కూరు అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే గిత్త జయసూర్య

  • సెంట్రల్ లైటింగ్ డివైడర్ పనులను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే
  • వారంలో రెండుసార్లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ
  • నాణ్యతలో రాజీ పడొద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశం

నందికొట్కూరు, ఆంధ్రప్రభ: పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా వారంలో రెండుసార్లు స్వయంగా క్షేత్రస్థాయికి వచ్చి అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం నందికొట్కూరు పట్టణంలో శరవేగంగా నిర్మాణం జరుగుతున్న సెంట్రల్ లైటింగ్ డివైడర్ పనులను ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. డివైడర్ నిర్మాణం లైటింగ్ ఏర్పాట్ల పురోగతిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.

పరిశీలన సమయంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మల వల్ల వాహనదారులకు పాదచారులకు ఇబ్బంది కలుగుతుందని గుర్తించిన ఎమ్మెల్యే, వాటిని వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. అయితే ప్రజలకు పర్యావరణానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తగా తొలగించాలని స్పష్టం చేశారు.డివైడర్ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ప్రజాధనం వృథా కాకుండా దీర్ఘకాలం మన్నిక ఉండేలా పనులు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు గట్టిగా సూచించారు.

సెంట్రల్ లైటింగ్ డివైడర్ పూర్తయితే పట్టణ సుందరీకరణతో పాటు రాత్రి వేళల్లో ప్రమాదాలు తగ్గి ట్రాఫిక్ నియంత్రణ సులభమవుతుందని ఎమ్మెల్యే అన్నారు.నందికొట్కూరును మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, అందుకే ప్రతి పనిని స్వయంగా పర్యవేక్షిస్తున్నానని ఎమ్మెల్యే జయసూర్య తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు సమావేశాలతో ఎంత బిజీగా ఉన్నా వారంలో రెండుసార్లు నియోజకవర్గంలో పర్యటించి అభివృద్ధి పనులను సమీక్షించడం ఆయన ప్రత్యేకత.ఈ తనిఖీల్లో మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, పట్టణ అధికారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగి పనులు చేయించడంపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.