ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది

బొడ్డు వెంకటరమణ చౌదరి

రాజమహేంద్రవరం, ఆంధ్రప్రభ: మెడికో ప్రియాంక కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని టీడీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు, రూడా చైర్మన్, రాజానగరం నియోజకవర్గ ఇన్‌చార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. రాజమహేంద్రవరం ఇటీవల చోటుచేసుకున్న మెడికో ప్రియాంక ఘటనపై రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలోని కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ… మెడికో ప్రియాంక మృతి తీవ్రంగా కలచివేసిందని, ఆమె కుటుంబానికి కూటమి ప్రభుత్వం, పార్టీ నాయకత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. ప్రియాంక కుటుంబం పడుతున్న బాధను మాటల్లో చెప్పలేమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాన్ని కఠినంగా అమలు చేయడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం, కూటమి నాయకత్వం వారి వెన్నంటే ఉంటుందని స్పష్టం చేశారు.