ప్రస్తుత డిజిటల్ యగంలో అన్నీ ఫోన్ తోనే అయిపోతున్నాయి. ఏ చిన్న పనికైనా క్యాష్ కన్నా ఎక్కువగా.. యూపీఐ నే వాడుతున్నారు. ఫోన్ తీశామా… టక్కుమని డబ్బులు కొట్టామా అన్నట్టు అయిపోయింది. అయితే, ఈ డిజిటల్ పేమెంట్స్ ను మరింత సులబతరం చేయటానికి కొత్త అప్ డేట్ రానుంది. ఇక పై యూపీఐ చెల్లింపులకు పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు.
చెల్లింపులను వేగంగా పూర్తి చేయడానికి ఫింగర్‌ప్రింట్, ఫేషియల్ రికగ్నిషన్ వంటి బయోమెట్రిక్ పద్ధతులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఈ సౌకర్యం అక్టోబర్ 8 నుంచి అందుబాటులోకి రానున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) వర్గాలు వెల్లడించాయి.
ప్రభుత్వం నిర్వహించే ఆధార్ డేటాబేస్‌లో అందుబాటులో ఉన్న బయోమెట్రిక్ వివరాలపై ఈ ధృవీకరణ ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. ఇప్పటివరకు యూపీఐ లావాదేవీలకు తప్పనిసరిగా పిన్ (numeric PIN) అవసరం ఉండేది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం ప్రత్యామ్నాయ పద్ధతులను అనుమతించడంతో ఈ మార్పు చోటు చేసుకుంటోంది.
యూపీఐని నిర్వహిస్తున్న ఎన్‌పీసీఐ, ముంబైలో జరుగుతున్న గ్లోబల్ ఫింటెక్ ఫెస్టివల్ సందర్భంగా ఈ కొత్త సౌకర్యాన్ని ప్రదర్శించనుంది. అయితే, సంస్థ అధికారిక ప్రకటన ఇప్పటివరకు విడుదల కాలేదు.

