Devotional – బాసరకు పోటెత్తిన భక్తులు- అక్షరాభ్యాస మండపం కిటకిట
బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : వసంత పంచమి సందర్భంగా ఆదివారం బాసర పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. సరస్వతి అమ్మవారి జన్మదినం కావడంతో అక్షరాభ్యాస పూజల కోసం పిల్లలను అధిక సంఖ్యలో తీసుకొచ్చారు. దీంతో అక్షరాభ్యాస మండపం కిటకిటలాడింది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండే కాక మహారాష్ట్ర, కర్ణాటక తమిళనాడు నుంచి భక్తులు తమ పిల్లలను తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేయించారు. ఉదయం ఆరు గంటల నుండి అమ్మవారి మండపం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మూడు ప్రత్యేక అక్షరాభ్యాస మండపాలతోపాటు, సాధారణ అక్షరాభ్యాస మండపంలో ఆలయ అర్చకులు పూజలు నిర్వహిస్తున్నారు.
వసంత పంచమి సందర్భంగా…అమ్మవారి జన్మదినం వసంత పంచమి పురస్కరించుకొని జ్ఞాన సరస్వతి దేవి కొలువైన బాసర అమ్మవారి చెంత అక్షరాభ్యాస పూజలు జరిపిస్తే చిన్నారులు ఉన్నత విద్యావంతుల అవుతారని భక్తుల నమ్మకం.
దేశంలోని రెండు సరస్వతి ఆలయాలలో ఒకటి కాశ్మీర్‌లో ఉండగా, రెండోది తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి నిలయం కలదు. వసంత పంచమి సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని విద్యుత్ దీపాలు పూలతో అందంగా అలంకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

సోమవారం అమ్మవార్లకు పట్టు వస్త్రాలు
అమ్మవారి జన్మదినం వసంత పంచమి సందర్భంగా సోమవారము ఉదయం 10 గంటలకు జిల్లా కలెక్టర్ ఆలయ అధికారులచే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కలెక్టర్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.భారీగా పోలీసు బందోబస్తువసంత పంచమి ఉత్సవాల్లో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఇద్దరు ఏఎస్పీలు, సీఐలు పది మంది, ఎస్సైలు 22 మంది, మహిళ ఎస్సైలు ముగ్గురు, ఏఎస్ఐలు పది హేను మంది, 200 మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో ఉన్నారు.