గరిడేపల్లిలో ఎస్టీలకు రిజర్వేషన్ డిమాండ్

గరిడేపల్లిలో ఎస్టీలకు రిజర్వేషన్ డిమాండ్

  • ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు కేటాయించాలని వినతి

గరిడేపల్లి, ఆంధ్రప్రభ : మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గరిడేపల్లి మండలంలో రిజర్వేషన్ల అంశం చర్చనీయాంశమైంది. రానున్న ఎన్నికల్లో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను ఎస్టీలకు కేటాయించాలని బీఆర్ఎస్ మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు గుగులోతు సందీప్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన గిరిజన నాయకులతో కలిసి మాట్లాడుతూ, మండలం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ స్థానాలు ఎస్టీలకు కేటాయించలేదని తెలిపారు. ఎస్సీ, బీసీ మరియు ఇతర వర్గాలకు అవకాశాలు లభించినప్పటికీ, గిరిజనులకు మాత్రం జనాభా ప్రాతిపదికన న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

రిజర్వేషన్లు అనుకూలించకపోవడం వల్ల గిరిజన నాయకులు కీలక పదవులకు దూరమవుతున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో సామాజిక న్యాయం పాటిస్తూ గరిడేపల్లి రోస్టర్ పాయింట్లను మార్చి ఎస్టీలకు కేటాయించాలని కోరారు. గిరిజనుల అభివృద్ధి కోసం రాజకీయ భాగస్వామ్యం అవసరమని, ఈసారి కూడా అన్యాయం జరిగితే సహించబోమని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు గుగులోతు నీలా హేమ్లా నాయక్, బాలు నాయక్, నరేందర్ నాయక్, రవీందర్ నాయక్, రామన్ నాయక్, నాగు నాయక్ తదితరులు పాల్గొని సందీప్ నాయక్ డిమాండ్‌కు మద్దతు తెలిపారు.

Leave a Reply