Cricket | ఆంధ్ర వికెట్ కీపర్లకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ..

Cricket | ఆంధ్ర వికెట్ కీపర్లకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ..

Cricket | విజయనగరంలో ఏసీఏ ప్రత్యేక క్యాంపు ప్రారంభం…
భారత మాజీ దిగ్గజం కిరణ్ మోర్ మార్గదర్శకత్వం..
యువ ప్రతిభకు పదును పెడుతున్న ఏ సి ఏ

Cricket | ఆంధ్రప్రభ విజయవాడ : రాష్ట్ర క్రికెట్ భవిష్యత్తును మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విజయనగరంలోని ఏసీఏ నార్త్ జోన్ అకాడమీలో గురువారం నుంచి మూడు రోజుల ప్రత్యేక వికెట్-కీపింగ్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. మే 14 నుంచి 16 వరకు జరగనున్న ఈ ప్రత్యేక క్యాంపుకు భారత క్రికెట్ జట్టుకు ఎన్నో విజయాల్లో భాగమైన మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోర్ స్వయంగా హాజరై యువ ఆటగాళ్లకు శిక్షణ అందిస్తున్నారు. ఈ శిబిరం ఆంధ్ర క్రికెట్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఉదయం 9 గంటలకు గ్రౌండ్‌కు చేరుకున్న కిరణ్ మోర్ ఆటగాళ్లతో నేరుగా మమేకమై తన అంతర్జాతీయ కెరీర్‌లో ఎదుర్కొన్న సవాళ్లు, మ్యాచ్ పరిస్థితుల్లో వికెట్ కీపర్ తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఫుట్‌వర్క్, రిఫ్లెక్సెస్, క్యాచ్ింగ్ టెక్నిక్స్, స్టంపింగ్‌లో వేగం, గేమ్ అవేర్‌నెస్ వంటి అంశాలపై సమగ్ర మార్గదర్శకత్వం అందించారు. సాంకేతిక అంశాలతో పాటు మ్యాచ్ ప్రెజర్‌ను ఎలా హ్యాండిల్ చేయాలో వివరించడంతో యువ ఆటగాళ్లు ఆసక్తిగా శిక్షణ పొందారు. రాష్ట్రంలో క్రికెట్ ప్రతిభను మరింత మెరుగుపరచాలన్న దిశగా ఏసీఏ వరుసగా కొత్త కార్యక్రమాలు చేపడుతోంది. ఇటీవల వేగ బౌలర్ల టాలెంట్ హంట్ ప్రకటించిన ఏసీఏ, ఇప్పుడు వికెట్ కీపర్లకు ప్రత్యేక క్యాంప్ నిర్వహించడం ద్వారా ప్రతిభాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Cricket

ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సాన సతీష్ బాబు మాట్లాడుతూ, కిరణ్ మోర్ వంటి దిగ్గజం తమ ఆటగాళ్లకు శిక్షణ ఇవ్వడం రాష్ట్ర క్రికెట్‌కు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. యువ ప్రతిభను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో అసోసియేషన్ నిరంతరం పనిచేస్తోందన్నారు. ఈ శిబిరంలో సీనియర్, అండర్-23, అండర్-19, అండర్-16 విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన వికెట్ కీపర్లు పాల్గొంటున్నారు. సీనియర్ విభాగంలో రికీ భూయ్, యూఎంఎస్ గిరినాథ్ వంటి అనుభవజ్ఞులతో పాటు జూనియర్ విభాగాల్లో ఎదుగుతున్న యువ ఆటగాళ్లు పాల్గొనడం క్యాంప్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారింది. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఆటగాళ్లను తీసుకెళ్లాలన్న ఏసీఏ దీర్ఘకాలిక వ్యూహంలో ఈ శిక్షణ శిబిరం కీలక అడుగుగా క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. విజయనగరం క్రికెట్ కేంద్రంగా మరింత గుర్తింపు పొందుతున్న తరుణంలో ఈ క్యాంప్ రాష్ట్ర క్రికెట్‌కు కొత్త దిశను చూపనుందని క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Cricket

CLICK HERE TO READ IPL 2026 | ముంబై కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా!

CLICK HERE TO READ MORE

Leave a Reply