ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు హాజరు కావాలి
సోమవారం ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో కార్యక్రమం..
శాఖల వారీగా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి చర్యలు
ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఊట్కూర్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి మండలంలోని అన్ని శాఖల అధికారులు విధిగా హాజరు కావాలని ఎంపీడీవో పావని సూచించారు. నారాయణపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు ఆమె ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఎంపీడీవో పేర్కొన్నారు. మండల పరిధిలోని అన్ని శాఖల అధికారులు సోమవారం ఉదయం 10 గంటలకు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకోవాలని సూచించారు.
ప్రజల నుంచి శాఖల వారీగా స్వీకరించే ఫిర్యాదులను అధికారులు బాధ్యతతో పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజావాణికి అధికారులు గైర్హాజరు కాకుండా తప్పనిసరిగా హాజరై తమ శాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎంపీడీవో పావని కోరారు.
