ఎస్‌ఐఆర్ పేరుతో పేదల ఓట్ల తొలగింపు కుట్ర: సతీష్ రెడ్డి
కడెం, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ద్వారా అమలు చేయనున్న ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ పేరుతో పేదల ఓట్లను గల్లంతు చేసే కుట్ర జరుగుతోందని నిర్మల్ డీసీసీ ప్రధాన కార్యదర్శి పొద్దుటూరి సతీష్ రెడ్డి ఆరోపించారు. బుధవారం మండల కేంద్రం కడెంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియ పేదల ఓటు హక్కుకు భంగం కలిగించే ప్రమాదం ఉందన్నారు. కూలీలు, వలస కార్మికుల వద్ద పాత ధ్రువపత్రాలు ఎక్కడ ఉంటాయని ప్రశ్నించారు.
పల్లెల్లో తరాలుగా నివసిస్తున్న నిరక్షరాస్యుల ఓట్లు తొలగిపోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. ఆధార్ అనుసంధానం పూర్తయిన తర్వాత మళ్లీ పాత పత్రాలు ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. ఇది ఓటరు జాబితా సవరణ ప్రక్రియ కాదని, పేదలను ఓటు హక్కుకు దూరం చేసే కుట్ర అని ఆరోపించారు. మహిళలు, వృద్ధులు బీఎల్‌ఓల వెంట తిరిగి పత్రాలు సమర్పించడం సాధ్యం కాదన్నారు.
ఓటు తమ జన్మహక్కు అని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమస్య కేవలం రాజకీయ పార్టీలది కాదని, ప్రజలందరికీ సంబంధించిన అంశమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని, లేకపోతే ప్రజలతో కలిసి శాంతియుత పోరాటాలు చేపడతామని హెచ్చరించారు.
