కాంగ్రెస్ గెలుపు ఖాయం – ఎంపీ రఘురాం రెడ్డి

  • జూబ్లీహిల్స్‌లో ప్రచార హీట్ పెంచిన మంత్రి ఉత్తమ్, ఎంపీ రఘురాం రెడ్డి

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఘన విజయం ఖాయమని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా.. గురువారం రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి విస్తృత ప్రచారం చేశారు.

అందులో భాగంగా కొల్లూరు డబల్ బెడ్రుమ్ ఏరియాలో నిర్వహించిన బహిరంగ సభలో.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ప్రసంగించారు. గత బీఆర్ఎస్ పాలనలో ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. ఎన్నికలు రాగానే ఆర్భాటం చేసే బీజేపీ.. ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాల సంక్షేమానికి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో… బీఆర్ఎస్ పాలనలో కొత్తగా ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదన్నారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేసిందని, దొడ్డు బియ్యానికి బదులు సన్న బియ్యం పంపిణీ చేసి అండగా నిలిచినట్లు తెలిపారు. తాగునీటి సమస్య లేకుండా, బిఎస్ఎన్ఎల్ ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థల బలోపేతానికి ముమ్మర కృషి జరుగుతున్నట్టు వివరించారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విపక్ష పార్టీలు ఎన్ని కుయుక్తులు పన్నినా.. రాబోయే అఖండ విజయం కాంగ్రెస్ పార్టీదే అని సభాముఖంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply