ఎంఐఎంకి కీలుబొమ్మగా కాంగ్రెస్, బీఆర్ఎస్..

జూబ్లీహిల్స్, ఆంధ్రప్రభ : ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు అన్న స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. మన హిందువుల ఓటుతో యూసఫ్‌గూడ సత్తా ఏంటో రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి చూపించాలని ప్రజలకు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి యూసుఫ్‌గూడ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీకి కీలుబొమ్మగా మారిందని, ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ తరపునే ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్ అభ్యర్థికి బహిరంగంగా ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గతంలో ఎంఐఎం పార్టీ నుంచే పోటీ చేశారని, గుర్తు మారింది కానీ అభ్యర్థి మాత్రం ఒక్కడే అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పతంగి గుర్తు స్థానంలో చేయి గుర్తు పెట్టుకుని పోటీ చేస్తున్నా, వాస్తవానికి ఆ అభ్యర్థి ఎంఐఎం పార్టీకే చెందారని అన్నారు. ఎంఐఎం నుంచి అభ్యర్థిని అరువు తెచ్చుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ముఖ్యమంత్రికి వచ్చిందని, ఎంఐఎం పార్టీ ముందు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మోకరిల్లిందని విమర్శించారు.
రేవంత్ రెడ్డి మంత్రులు తమ బాధ్యతలు పక్కన పెట్టి, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముస్లిం ఓట్లతో ఎలా గెలవాలనే దానిపైనే దృష్టి పెట్టారని ఆరోపించారు. ముస్లింలకు వేల ఎకరాలు కేటాయించి, బంజారాహిల్స్‌లో పెద్దమ్మ గుడిని కూల్చివేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని విమర్శించారు.
మెహదీపట్నం, ఎర్రగడ్డ ప్రాంతాల్లో ఖబర్‌స్తాన్‌ల కోసం స్థలం ఇవ్వడానికి మనసొచ్చింది కానీ, బంజారాహిల్స్‌లో పెద్దమ్మ తల్లి గుడికి 50 గజాల స్థలం ఇవ్వడం మాత్రం కుదరలేదని, హిందూ దేవాలయాల కోసం స్థలం కేటాయించడంలో ఇంత వెనుకంజ ఎందుకు? అని ప్రశ్నించారు. ఎంఐఎంకి బీఆర్‌ఎస్–కాంగ్రెస్ పార్టీ నేతలు వంగి వంగి సలాం కొడుతున్నారని, వీరు మజ్లీస్ పార్టీ చేతిలో కీలుబొమ్మల్లా మారారని అన్నారు.
ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన అబద్ధపు హామీలపై కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలని కోరారు. ముఖ్యంగా, మహిళలకు ఇస్తామన్న రూ. 2500, తులం బంగారం, చదువుకునే ఆడబిడ్డలకు స్కూటీ, విద్యార్థులకు “విద్య భరోసా కార్డు”, రూ. 5 లక్షలు, దళిత కుటుంబాలకు రూ. 12 లక్షలు, బీసీల కోసం లక్ష కోట్ల బడ్జెట్, పెన్షన్ రూ. 4000 పెంపు వంటి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కొత్త పెన్షన్ ఒక్కటి కూడా ఇవ్వలేదని విమర్శించారు.
జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం బీజేపీకి ఓటేయాలని, 4 లక్షల ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్‌లో మనం ఐక్యతా చూపాలని పిలుపునిచ్చారు. అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని మోడీ ధైర్యంతో చేపట్టారని, మన గౌరవం ఉండాలంటే హిందుత్వం ఉండాలని, హిందుత్వం ఉన్నప్పుడే నిజమైన సెక్యులరిజం ఉంటుందని అన్నారు.
కేసీఆర్ ఒక్కసారైనా అసెంబ్లీలోకి వచ్చి ప్రజల సమస్యల గురించి మాట్లాడారా? అని ప్రశ్నిస్తూ, బీఆర్‌ఎస్ పార్టీకి ఓటేస్తే మూసిలో వేసినట్టేనని అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్, మంత్రిగా కేటీఆర్ ఉండి జూబ్లీహిల్స్ అభివృద్ధికి ఏమి చేశారని నిలదీశారు.
ఓటర్లను భయపెట్టే ధోరణిలో జూబ్లీహిల్స్‌లో ఓటు వేయకపోతే బియ్యం ఆగిపోతుంది అని చేస్తున్న ప్రచారం అబద్ధమని, సన్నబియ్యం పథకం కేంద్ర ప్రభుత్వ పథకమని స్పష్టం చేశారు. ఉచిత బస్సు పథకం కంటే యువతకు ఉద్యోగాలు, మహిళలకు పావలా వడ్డీ రుణాలు, వ్యాపార అవకాశాలు, విధిలైట్లు కావాలని జూబ్లీహిల్స్ అభివృద్ధి కావాలని అన్నారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఓట్లు కొనాలని చూస్తున్నాయని, మన ఓట్లు అమ్ముకోవద్దు, ఆత్మగౌరవంతో నిలబడి, అభివృద్ధి కోసం బీజేపీని గెలిపిద్దామని కోరారు. బీజేపీ ఉన్నంతవరకు హైదరాబాద్ ప్రజలకు రక్షణ ఉంటుందని హామీ ఇచ్చారు.
