మురుగునీటి సమస్య పరిష్కరించాలి..
- మదర్ డైరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీ నర్సింహారెడ్డి
మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం పాటిమట్ల నుంచి అడ్డగూడూరు వరకు చేపట్టాల్సిన బృందావనం కాల్వ పనులను తక్షణమే ప్రారంభించాలని మదర్ డెయిరీ డైరెక్టర్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు రచ్చ లక్ష్మీనరసింహారెడ్డి డిమాండ్ చేశారు.
మంగళవారం ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బృందావనం కాల్వ నిర్మాణం కోసం రూ.1 కోటి నిధులు మంజూరయ్యాయని, అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడం బాధాకరమన్నారు.
అలాగే బీబీనగర్ మండలంలోని బునాదిగాని చెరువు నుంచి అడ్డగూడూరు మండలం ధర్మారం వరకు నిర్మించాల్సిన బునాదిగాని కాల్వ కోసం గత ప్రభుత్వంలో రూ.271 కోట్ల నిధులు మంజూరైనా ఇప్పటి వరకు పనులు ప్రారంభించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు.
మోత్కూర్ పట్టణంలో మురుగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు స్థానిక సంస్థలు చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజలకు ఉపయోగపడే సాగునీటి ప్రాజెక్టులు, కాల్వల నిర్మాణ పనుల్లో జాప్యం చేయకుండా ప్రభుత్వం వెంటనే పనులు ప్రారంభించాలని లక్ష్మీనరసింహారెడ్డి డిమాండ్ చేశారు.
