మిల్లు గేటుకు తాళం.. కుటుంబం లోపలే!
అప్పు తీర్చేందుకు సమయం ఇవ్వండి.. ప్రాణహాని ఉంది: రాజశేఖర్‌రెడ్డి కుటుంబం
గద్వాల ప్రతినిధి (ఆంధ్రప్రభ): జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి సమీపంలోని వీరాపురం వద్ద జిన్నింగ్ మిల్లులో రాజశేఖర్‌రెడ్డి, ఆయన భార్య, కుమారుడు, బావమరిది రెండు రోజులుగా బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మిల్లు గేటుకు తాళం వేసి తమను లోపలే ఉంచారని, భోజనం తీసుకురావడానికి కూడా ఎవరినీ అనుమతించడం లేదని వారు తెలిపారు. 2021లో తమకు చెందిన జిన్నింగ్ మిల్లులు, గద్వాలలోని ఇల్లు, ప్లాట్లు, గట్టు మండలం, రాయపురం, మక్తల్ నియోజకవర్గంలోని భూములకు సంబంధించిన పత్రాలను స్మార్ట్ ఇండియా నిర్వాహకుడు కరుణాకర్‌రెడ్డి పేరుతో విక్రయ పత్రాల ద్వారా రిజిస్టర్ చేసి రూ.5.30 కోట్లు అప్పుగా తీసుకున్నామని రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. వ్యాపారంలో నష్టం రావడంతో అప్పు చెల్లించేందుకు కొంత సమయం కోరుతున్నా అవకాశం ఇవ్వకుండా తనపై, కుటుంబంపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. మిల్లు సమీపంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ధ్వంసం చేసి విద్యుత్ సరఫరా నిలిపివేశారని, 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. కరుణాకర్‌రెడ్డి, ఆయన అనుచరుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కుటుంబ సభ్యులు కోరారు.
మరోవైపు స్మార్ట్ ఇండియా నిర్వాహకుడు కరుణాకర్‌రెడ్డి ఆరోపణలను ఖండిస్తూ.. రాజశేఖర్‌రెడ్డి తన ఆస్తులను విక్రయ పత్రాల ద్వారా ఇచ్చి రూ.6 కోట్లకుపైగా అప్పు తీసుకున్నారని తెలిపారు. మూడేళ్లలో అప్పు చెల్లిస్తానని చెప్పినా ఇప్పటివరకు చెల్లించలేదన్నారు. పలుమార్లు అప్పు చెల్లించాలని కోరడంతో పాటు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టినా స్పందించకపోవడంతో కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకుని ఆస్తుల పొజిషన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తీసుకున్న అప్పును వడ్డీతో సహా పూర్తిగా చెల్లిస్తే ఆస్తులను తిరిగి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కరుణాకర్‌రెడ్డి తెలిపారు.
