వద్దన్నా.. వరి సాగుకే రైతుల మొగ్గు

హనుమకొండ/శాయంపేట (ఆంధ్రప్రభ): ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని, వరికి బదులుగా ఆరుతడి లేదా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సూచిస్తున్నా రైతులు మాత్రం వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. వర్షాలు ఆలస్యమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలే సురక్షితమని అధికారులు చెబుతున్నా.. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మండలంలోని చాలా గ్రామాల్లో ఇప్పటికే రైతులు వరి సాగు చేస్తున్నారు.

వరి సాగుకు నీటి లభ్యతపై అనుమానాలు ఉన్నప్పటికీ రైతులు అదే పంట వైపు వెళ్లడానికి పలు కారణాలున్నాయి. ముఖ్యంగా సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం బోనస్‌ ప్రకటించడం కూడా వరి సాగు పెరగడానికి ప్రధాన కారణంగా మారిందని రైతులు చెబుతున్నారు. దీంతో వర్షాభావ పరిస్థితుల్లోనూ రైతులు అధికారుల సూచనలను పక్కనపెట్టి వరి సాగుకే ప్రాధాన్యం ఇస్తున్నారు.