మైనర్ బాలికలపై ఆటో డ్రైవర్ల దారుణం
నిర్మానుష్య టిడ్కో ఇళ్లలోకి తీసుకెళ్లి లైంగిక దాడి.. ఇద్దరి అరెస్ట్
పెడన (ఆంధ్రప్రభ): మైనర్ బాలికలను మాయమాటలతో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడిన ఘటన మచిలీపట్నంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. పెడన మండలం బల్లిపర్రు గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు ఈ నెల 6న పాఠశాల నుంచి మచిలీపట్నం వచ్చారు. శారదానగర్‌కు చెందిన పరిచయస్తుడికి ఫోన్ చేయగా.. అతడు మరో యువకుడితో కలిసి కోనేరు సెంటర్‌కు ఆటోలో వచ్చి బాలికలను తీసుకెళ్లాడు. అనంతరం వారిని రుద్రవరం ప్రాంతంలోని నిర్మానుష్య టిడ్కో గృహాల వద్దకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
మరుసటి రోజు ఓ బాలిక అస్వస్థతకు గురికావడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నించగా జరిగిన విషయాన్ని వెల్లడించింది. దీంతో తల్లిదండ్రులు పెడన పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. రుద్రవరానికి చెందిన ఆటో డ్రైవర్‌తో పాటు శారదానగర్‌కు చెందిన యువకుడిపై పోక్సో, అత్యాచారం కేసులు నమోదు చేసి ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం రాత్రి వెల్లడించారు.
