సాగునీరు లేక నెర్రలిచ్చిన వరి పొలాలు
మొవ్వ (ఆంధ్రప్రభ): వరుణుడు మొహం చాటేయడం, అరకొరగా సాగునీరు విడుదల కావడం, అధిక ఉష్ణోగ్రతలతో మొవ్వ మండలంలో నాట్లు వేసిన వరి పొలాలు నెర్రలిస్తున్నాయి. అధిక వ్యయంతో ఆయిల్ ఇంజన్ల ద్వారా నీటిని తోడి పైరును కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మండలంలో ఇప్పటివరకు సుమారు 80 శాతం వరినాట్లు పూర్తికాగా.. మరో 20 శాతం నాట్లు వేయాల్సి ఉంది. కూచిపూడి, మొవ్వ, బార్లపూడి, భట్లపెనుమర్రు, పెడసనగల్లు, అయ్యంకి, కారకంపాడు, చినముత్తేవి, పెదపూడి, నిడుమోలు తదితర గ్రామాల్లో సాగునీరు అందక నాట్లు వేసిన పొలాలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది మండలంలో సుమారు 4 వేల నుంచి 5 వేల ఎకరాల్లో వెద పద్ధతిలో వరి సాగు చేయగా, మిగిలిన విస్తీర్ణంలో నాట్లు వేసి సాగు చేపట్టారు.
ఆగస్టు రెండో వారం సమీపిస్తున్నా ఇంకా నాట్లు వేయని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారం రోజులుగా ఆకాశం మేఘావృతంగా ఉండటంతో వర్షం కురుస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నా.. వరుణుడు కరుణించడం లేదని రైతులు అంటున్నారు. ఇప్పటికే నాట్లు వేసిన పొలాలు ఎండిపోయే దశకు చేరుకోగా, నాట్లు వేయాల్సిన రైతుల పరిస్థితి మరింత ప్రశ్నార్థకంగా మారింది. వేలాది రూపాయలు ఖర్చు చేసి ఆయిల్ ఇంజన్లతో నీటిని తోడుకుంటూ పంటను కాపాడుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకునేందుకు తమ భూములు అనుకూలంగా లేవని, ఈ సీజన్లో వరి, రెండో పంటగా మినుము మాత్రమే సాగు చేస్తామని చెబుతున్నారు. సాగునీరు సక్రమంగా అందించి పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.
