పేదల పింఛన్లపై వడ్డీ వ్యాపారుల కన్ను!
పింఛన్ కార్డులు చేతిలో.. నెలనెలా వడ్డీ వసూళ్లు
అసలు తీర్చినా.. వడ్డీ భారం తీరని దుస్థితి
కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ: పేదల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని కన్నాయిగూడెం మండలంలో కొందరు వడ్డీ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్యవసర సమయంలో అప్పు ఇచ్చి, పింఛన్ కార్డులను తమ వద్ద ఉంచుకుని ప్రతి నెలా పింఛన్ సొమ్ము నుంచి వడ్డీ వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో అప్పుగా తీసుకున్న అసలు మొత్తాన్ని చెల్లించినా.. వడ్డీ భారం మాత్రం తగ్గడం లేదని బాధితులు వాపోతున్నారు.
పింఛన్ సొమ్ముపైనే ఆధారపడే వృద్ధులు మందులు, నిత్యావసరాల కోసం ఆ డబ్బును వినియోగించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. పేదల ఆర్థిక బలహీనతను పెట్టుబడిగా చేసుకుని పింఛనే ఆదాయ వనరుగా కొందరు వడ్డీ వ్యాపారులు మార్చుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పింఛన్దారుల కార్డులను తాకట్టు పెట్టించుకుని వడ్డీ వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై అధికారులు తక్షణమే దృష్టి సారించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
