Social media | ప్రధాని మోదీ సంచలన ట్వీట్!

Social media | న్యూఢిల్లీ (ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్) : భారత పార్లమెంటు చరిత్రలో ఈరోజు అత్యంత కీలకమైన ఘట్టం ఆవిష్కృతం కానుంది. లోక్‌సభలో మరో కొద్ది గంటల్లో మూడు చారిత్రాత్మక బిల్లులపై ఓటింగ్ జరగనుంది. నేడు సాయంత్రం 4 గంటలకు డీలిమిటేషన్ బిల్లు, నారీశక్తి వందన బిల్లుతో పాటు 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఈ కీలక ఓటింగ్ తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా సభ్యులకు ఒక బహిరంగ విజ్ఞప్తి చేస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు. దాదాపు నాలుగు దశాబ్దాల రాజకీయ నిరీక్షణకు తెరదించుతూ, నిర్ణయాధికారాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించే ‘నారీ శక్తి వందన్ అధినియం’పై పార్లమెంటులో సుదీర్ఘ చర్చ ముగిసిందని ఆయన పేర్కొన్నారు.

సభ్యుల అపోహలన్నింటినీ ప్రభుత్వం తార్కిక వివరణలతో ఇప్పటికే తొలగించిందని ప్రధాని స్పష్టం చేశారు. దేశ జనాభాలో సగభాగంగా ఉన్న మహిళల హక్కులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందని ఆయన గుర్తు చేశారు. లోక్‌సభలో జరగబోయే ఓటింగ్‌లో రాజకీయాలకు అతీతంగా, పూర్తి సున్నితత్వంతో ఈ బిల్లుకు మద్దతు తెలపాలని సభ్యులందరికీ విజ్ఞప్తి చేశారు.

కోట్లాది మంది మహిళల ఆకాంక్షలను ప్రతిబింబించే ఈ చారిత్రక నిర్ణయానికి అనుకూలంగా ఓటు వేయాలని ప్రధాని కోరారు. ‘నారీ శక్తి’ గౌరవాన్ని చాటిచెప్పేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రధాని పిలుపుతో మరికాసేపట్లో జరగబోయే ఓటింగ్ ఫలితంపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Leave a Reply